"ఆ రెండు నిర్ణయాలే" కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణం..!

27 Sep, 2021 19:53 IST|Sakshi

BCCI Did Not Consult Kohli About Appointing Dhoni As Mentor: ప్రపంచకప్‌ తర్వాత టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ విరాట్‌ కోహ్లి బాంబు పేల్చిన నేపథ్యంలో అతని నిర్ణయం వెనుక గల అసలు కారణాలపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వర్క్‌ లోడ్‌ కారణంగా పొట్టి క్రికెట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నానని స్వయంగా కోహ్లినే ప్రకటించినప్పటికీ.. అతని నిర్ణయం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఇదే విషయపై తాజాగా మరో వార్త నెట్టింట షికార్లు చేస్తుంది. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఆ రెండు నిర్ణయాలే కారణమన్నది ఆ వార్త సారాంశం. 

ఆ రెండు నిర్ణయాల్లో మొదటిది.. టీమిండియా మెంటార్‌గా ధోని నియామకం కాగా, రెండోది టీ20 ప్రపంచకప్‌ జట్టులో అశ్విన్‌ ఎంపిక. వివరాల్లోకి వెళితే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ల్లో టీమిండియా ఓడిన నాటి నుంచి ​కోహ్లి కెప్టెన్సీపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారు. దీంతో కోహ్లిని సంప్రదించకుండానే ధోనిని టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా మెంటార్‌గా నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, టీ20 ప్రపంచకప్‌ జట్టులో చహల్‌ ఉండాలని కోహ్లి పట్టుబట్టినప్పటికీ.. రోహిత్‌ సలహా మేరకు సెలెక్షన్‌ కమిటీ అశ్విన్‌ను ఎంపిక చేసింది. 

తన ప్రమేయం లేకుండా బీసీసీఐ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలను జీర్ణించుకోలేకపోయిన కోహ్లి.. పొట్టి క్రికెట్‌ పగ్గాలు వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కోహ్లిని టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు అశ్విన్‌ ప్రధాన కారణం అని మరో వాదన వినిపిస్తుంది. ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లి.. అశ్విన్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టాడని.. ఇది బీసీసీఐకి అస్సలు నచ్చలేదని.. దీంతో కోహ్లి విషయంలో పొమ్మనలేక పొగ పెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అశ్విన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. కోహ్లి అతన్ని ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించలేదు. ఈ విషయమై కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి మధ్య కూడా వాదన జరిగినట్లు సమాచారం.
చదవండి: ఆ మ్యాచ్‌కు "స్టేడియం ఫుల్‌"గా అనుమతివ్వండి.. బీసీసీఐ విజ్ఞప్తి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు