బీసీసీఐ ఎన్నికలు: ముహూర్తం ఖరారు

27 Sep, 2022 04:24 IST|Sakshi

అక్టోబర్‌ 18న  బీసీసీఐ ఎన్నికలు

ముంబై: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డులో ఎన్నికలకు నగారా మోగింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)లోని పదవుల కోసం అక్టోబర్‌ 18న ఎన్నికలు జరపనున్నట్లు బోర్డు ఎన్నికల అధికారి ప్రకటించారు. అదే రోజు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా నిర్వహిస్తారు. భారత ఎలక్షన్‌ కమిషన్‌ మాజీ చీఫ్‌ కమిషనర్‌ ఏకే జోటి దీనికి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.

నోటిఫికేషన్‌ జారీ చేసిన ఆయన ఈ వివరాలను ఇప్పటికే  బీసీసీఐ పరిధిలోని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు అందించారు. వీరంతా తమ సంఘం తరఫు నుంచి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను బోర్డుకు పంపించాలని ఆయన కోరారు. గతంలో ఎన్నికల ప్రక్రియలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారే బరిలోకి దిగాలని కూడా ఎన్నికల అధికారి ప్రత్యేకంగా సూచించారు.

బోర్డు నియమావళి ప్రకారం ఐదు కీలకమైన ఆఫీస్‌ బేరర్‌ పదవులకు (అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి) ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటు ఒక అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడిని, ఇద్దరు గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. అక్టోబర్‌ 11, 12 తేదీల్లో దరఖాస్తులు స్వీకరించనుండగా... 18న ఎన్నికలు జరిపి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే బీసీసీఐ ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉన్నా... వివిధ అంశాలపై సుప్రీం కోర్టు నుంచి స్పష్టత కోరుతూ బోర్డు ఇప్పటి వరకు ఆగింది. ఇటీవల సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కీలక ఆదేశాలు రావడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న సౌరవ్‌       గంగూలీ, జై షా అదే పదవుల కోసం బరిలో        ఉంటారా... లేక వీరిలో ఒకరు ఐసీసీ వైపు వెళ్లి కొత్తవారు ఆ పదవిలో వస్తారా వేచి చూడాలి.   
 

మరిన్ని వార్తలు