IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన

3 Jan, 2023 15:37 IST|Sakshi

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ అందింది. గత కొంత కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి లంకతో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. కాగా తొలుత వన్డే సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించిన 15 ‍మంది సభ్యుల జట్టులో బుమ్రా పేరు లేదు.

తాజగా బుమ్రాను వన్డే జట్టులోకి చేర్చినట్లు బీసీసీఐ ట్వీట్‌ చేసింది. "శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ ​కోసం భారత జట్టులోకి పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆల్‌ ఇండియా  సీనియర్ సెలక్షన్ కమిటీ చేర్చింది" అని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు ఆస్ట్రేలియా సిరీస్‌ సందర్భంగా బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో పాటు పొట్టి ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే బుమ్రా ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడు. దీంతో అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టునున్నాడు. ఇక స్వదేశంలో లంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. జనవరి 3 నుంచి 7 వరకు టీ20 సిరీస్‌ జరగనుండగా.. జనవరి 10 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.

లంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్‌
చదవండి: Ind Vs SL: టాప్‌-5లో వీళ్లే! భువీ అగ్రస్థానానికి ఎసరు పెట్టిన చహల్‌! అదే జరిగితే..

మరిన్ని వార్తలు