‘వివో’ వెనకడుగు...

5 Aug, 2020 02:06 IST|Sakshi

ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకోనున్న చైనా మొబైల్‌ సంస్థ

అన్ని వైపుల నుంచి ఒత్తిడితో స్వీయ నిర్ణయం

కొత్త స్పాన్సర్‌ వేటలో బీసీసీఐ

‘ఐపీఎల్‌–2020 స్పాన్సర్లలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా ప్రధాన స్పాన్సర్‌గా ‘వివో’ కొనసాగుతుంది’... ఆదివారం జరిగిన సమావేశం తర్వాత ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చేసిన అధికారిక ప్రకటన ఇది. అయితే రెండు రోజుల్లోపే అంతా మారిపోయింది. ఈ ఏడాది యూఏఈలో జరిగే లీగ్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు వదిలేసుకోవాలని చైనా మొబైల్‌ సంస్థ ‘వివో’ భావిస్తోంది. ఇంకా అధికారికంగా బీసీసీఐ దీనిని ఖరారు చేయకపోయినా... ‘వివో’ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ముంబై: ఐపీఎల్‌–13 కోసం సన్నద్ధమవుతున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కీలక సమయంలో షాక్‌ తగిలింది. టోర్నీ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న చైనా ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ కంపెనీ ‘వివో’ లీగ్‌తో భాగస్వామ్యాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంది. బోర్డు వైపు నుంచి ఎలాంటి సమస్యా లేకపోయినా చైనాకు చెందిన కంపెనీ కావడంతో ‘వివో’పై గత రెండు రోజులుగా విమర్శల పర్వం తీవ్రంగా సాగింది. గల్వాన్‌ లోయలో చైనా చేతిలో భారత సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలోనూ ‘వివో’తో జత కట్టడంపై కొందరు బహిరంగంగా బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టగా... పెద్ద సంఖ్యలో అభిమానులు సోషల్‌ మీడియాలో విరుచుకు పడ్డారు. దాంతో ‘వివో’ వెనక్కి తగ్గినట్లు సమాచారం.

భారీ మొత్తానికి... 
2008లో ఐపీఎల్‌ మొదలైన తర్వాత ముందుగా డీఎల్‌ఎఫ్, ఆ తర్వాత పెప్సీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించాయి. అయితే స్పాట్‌ ఫిక్సింగ్‌ అనంతరం వచ్చి న వివాదాలతో పెప్సీ అర్ధాంతరంగా తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోగా మధ్యలో రెండేళ్ల కాలానికి ‘వివో’ స్పాన్సర్‌షిప్‌ కోసం ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2017లో బోర్డుతో వివో ఐదేళ్ల కాలానికి భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2018–2022 మధ్య ఐదేళ్ల ఐపీఎల్‌కు రూ. 2199 కోట్లు (ఏడాదికి రూ. 440 కోట్ల చొప్పున) చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రస్తుతం రెండేళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

గల్వాన్‌ ఘటన తర్వాత చైనా కంపెనీలతో ఒప్పందాలను పునఃస్సమీక్షిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఐపీఎల్‌ సమావేశంలో మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. ‘కాంట్రాక్ట్‌ ఉల్లంఘన సమస్యలు’ తదితర అంశాలను కారణాలుగా చూపిస్తూ ‘వివో’ తదితర కంపెనీలను కొనసాగించేందుకే సిద్ధమైనట్లు ప్రకటించింది. ఒప్పందంలో ఇతర షరతులు, నిబంధనలపై పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోయినా... ఈసారి లీగ్‌తో జత కట్టడంకంటే దూరంగా ఉంటేనే మేలని ‘వివో’ భావించినట్లుంది. తాము చెల్లిస్తున్న భారీ మొత్తానికి తగినంత ప్రచారాన్ని, లాభాన్ని ఏ కంపెనీ అయినా కోరుకోవడం సహజం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘వివో’ ఆశించింది జరగకపోవచ్చు.

కరోనా ఒక కారణం కాగా, చైనా కంపెనీలపై భారత్‌లో వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ‘వివో’ ఆదాయంపై సహజంగానే ప్రభావం పడి ఉండవచ్చు. అన్నింటికి మంచి మరో ప్రధాన కారణం నిబంధనల ప్రకారం ఐపీఎల్‌ ఆటగాళ్లు, జట్లు కచ్చితంగా ‘వివో’ ఉత్పత్తులకు ప్రచారం చేసి పెట్టాలి. ఈ సమయంలో ఏ కోహ్లితోనో, ధోనితోనో ‘వివో’ ఫోన్‌ కొనమని చెప్పించడం అంత సులువు కాదు!  దీనివల్ల ప్రచారం కంటే ప్రతికూలం ప్రభావమే ఎక్కువగా పడుతుంది. వీటన్నింటికంటే లీగ్‌కు దూరంగా ఉండ టమే మేలని కంపెనీ అనుకున్నట్లుంది. అయితే అది ఈ ఒక్క ఏడాదికేనా లేక పూర్తిగా లీగ్‌ నుంచి తప్పుకున్నట్లా అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఒక్క ఏడాది మాత్రమే ‘వివో’ వైదొలగితే... ఒప్పందాన్ని 2023 వరకు పొడిగించే అవకాశం ఉంది.

మా సంగతేంటి... 
ఐపీఎల్‌ స్థాయిని బట్టి చూస్తే కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడం బోర్డుకు పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే ‘వివో’ ఇస్తున్న రూ. 440 కోట్లు వస్తాయా అనేది కాస్త సందేహమే. అంతకంటే తక్కువ మొత్తం రావచ్చని బోర్డు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మరో వైపు ‘వివో’ ఒప్పందం ప్రభావం తమపై ఏమాత్రం ఉండదని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ప్రధాన స్పాన్సర్‌ ద్వారా వచ్చే ఆదాయంలో ప్రతీ ఫ్రాంచైజీకి ఏడాదికి రూ. 20 కోట్లు లభిస్తాయి. ఇప్పుడు ‘వివో’ తప్పుకున్నా... మరొకరు వస్తే తమకు రావాల్సింది ఎలాగూ దక్కుతుందని, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి.
అయితే ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతించకపోతే కోల్పోయే టికెట్ల డబ్బు (గేట్‌ రెవిన్యూ) విషయంపై మాత్రం వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తాము కోల్పోయే ఆదాయాన్ని నష్టపరిహారంగా బోర్డు చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై తామంతా ఒకే తాటిపై ఉండాలంటూ ఒక ప్రముఖ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇతర ఏడు జట్ల మేనేజ్‌మెంట్‌లతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం యూఏఈలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కనీసం 30–40 శాతం ప్రేక్షకులనైనా అనుమతించేలా బోర్డు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 19 వరకు లీగ్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు