మ్యాచ్‌ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ ఆగ్రహం

7 Sep, 2021 15:01 IST|Sakshi

లండన్‌: 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఓవల్‌ మైదానంలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ జట్టు సారధి విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రిలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు ముందు వీరు బయో బబుల్‌ నిబంధనలను ఉల్లఘించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లితో పాటు మరికొందరు టీమిండియా సభ్యులు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే తొలుత రవిశాస్త్రి, ఆతర్వాత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు కరోనా బారిన పడినట్లు నిర్దారణ అయ్యింది. 

ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలినా కోహ్లి సహా ఇతర ఆటగాళ్లకు మాత్రం నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. అయితే ఈ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్ల‌డానికి(బయో బబుల్‌ నిబంధనలకు విరుద్ధంగా)  భారత బృందం.. బీసీసీఐ అనుమ‌తి కోర‌లేద‌ని తెలిసింది. దీంతో ఈ అంశాన్ని చాలా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న బోర్డు.. కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లిలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వీరి వివరణ కోరిన బీసీసీఐ.. కోహ్లిని సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. రిషబ్‌ పంత్ కరోనా బారిన పడిన తర్వాత బోర్డు సెక్రటరీ జై షా ఆటగాళ్లను అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినప్పటికీ భారత బృందం బయో నిబంధనలు ఉల్లంఘించి అజాగ్రత్తగా వ్యవహరించడంతో బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉ‍న్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, 50 ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆతిధ్య జట్టుపై 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 77/0తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 210 పరుగులకే ఆలౌటైంది. ఉమేశ్‌ యాదవ్‌ (3/60), శార్దూల్‌ ఠాకూర్‌ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్‌లో సూపర్‌ శతకంతో రాణించిన రోహిత్‌ శర్మకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. ఈ విజయంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. 
చదవండి: థాంక్యూ బుమ్రా.. బెయిర్‌స్టోను డకౌట్ చేశావ్: జార్వో సంబరం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు