BCCI: ఊహాగానాలకు తెర.. జనవరిలో కొత్త సెలెక్షన్‌ కమిటీ

29 Dec, 2022 19:54 IST|Sakshi

బీసీసీఐ కొత్త సెలక్ష‌న్ క‌మిటీ ఏర్పాటు గురించి వ‌స్తున్న ఊహాగానాల‌కు త్వ‌ర‌లోనే తెర‌ప‌డ‌నుంది. ఈ నెలాఖ‌రులోగా క‌మిటీ పేర్లు ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో కొత్త సెల‌క్ష‌న్ క‌మిటీ ఏర్ప‌డ‌నుంద‌ని సమాచారం. ముగ్గురు స‌భ్యుల క్రికెట్ స‌ల‌హా మండ‌లి కొత్త సెల‌క్ష‌న్ క‌మిటీ స‌భ్య‌ల‌ను ఎంపిక చేయ‌నుంది.

అశోక్ మ‌ల్హోత్రా, జ‌తిన్ ప‌రంజ‌పే, సుల‌క్ష‌ణ నాయ‌క్‌లు ముంబైలోని బీసీసీఐ ఆఫీసులో డిసెంబ‌ర్ 30వ తేదీన సమావేశం కానున్నారు. బీసీసీఐ అధికారుల‌తో చ‌ర్చించి సెల‌క్ష‌న్ క‌మిటీ స‌భ్యుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత ఎంపికైన వాళ్ల పేర్ల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఏడాది వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌కి భార‌త్ ఆతిథ్యం ఇస్తోంది. 2011 త‌ర్వాత ఒక్క మోగా టోర్న‌మెంట్‌లో కూడా టీమిండియా విజేత‌గా నిల‌వ‌లేదు.

దీంతో వచ్చే ఏడాది స్వ‌దేశంలో జ‌రగనున్న వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీపై భార‌త జ‌ట్టు క‌న్నేసింది. ఈ నేప‌థ్యంలో సెల‌క్ష‌న్ క‌మిటీ ఎన్నిక ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ ఏడాది శ్రీ‌లంక‌లో జ‌రిగిన ఆసియా క‌ప్‌లో భార‌త జ‌ట్టు చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంటిదారి ప‌ట్టింది. టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్లో టీమిండియా ఓట‌మి అనంత‌రం జ‌ట్టు కూర్పుపై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దాంతో చేత‌న్ శ‌ర్మ క‌మిటీని ర‌ద్దు చేయాల‌నే డిమాండ్లు వ‌చ్చాయి. సెల‌క్ష‌న్ క‌మిటీపై న‌వంబ‌ర్‌లో బీసీసీఐ వేటు వేసింది. ఆ వెంట‌నే నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఈ పోస్టుల‌కు అప్లై చేసుకునేవాళ్ల‌కు ఉండాల్సిన అర్హ‌త‌ల‌ను బీసీసీఐ స్ప‌ష్టంగా నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించింది.

చదవండి: Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు

కేన్‌ మామ డబుల్‌ సెంచరీ.. కివీస్‌ తరపున తొలి బ్యాటర్‌గా

మరిన్ని వార్తలు