BCCI: టీమిండియా ఆటగాళ్లకు ఊరట.. యోయో టెస్ట్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

26 Mar, 2022 12:09 IST|Sakshi

YO YO Test: టీమిండియా క్రికెటర్ల ఫిట్‌నెస్‌ స్థాయికి కొలమానంగా నిలిచే యోయో టెస్ట్‌ నిబంధనల్లో సడలింపలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిళ్లకు గురవుతున్నారని, ఇది దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లకు నిర్వహించే యోయో టెస్ట్‌ను కఠినతరం చేయకూడదని భావిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. యోయో టెస్ట్‌లో సడలింపులతో టీమిండియా ఆటగాళ్లకు ఊరట లభిస్తుందని, దీని వల్ల ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత లభిస్తుందని సదరు అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా, ఏదైనా సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే ముందు ఆటగాళ్లందరూ యోయో టెస్ట్‌లో తప్పనిసరిగా  ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల చాలా మంది ఆటగాళ్లు యోయో టెస్ట్‌లో తరుచూ విఫలమవుతూ, జట్టుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే యోయో టెస్ట్‌లో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ  నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, బీసీసీఐ నిర్వహించే యోయో టెస్ట్‌లో విఫలమైన భారత ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉండదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంలో బీసీసీఐ నుంచి క్లారిటీ రావడంతో యోయో టెస్ట్‌లో విఫలమైన ఐపీఎల్‌ ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల ఎన్‌సీఏ క్యాంప్‌లో బీసీసీఐ నిర్వహించిన యోయో టెస్ట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక ఆటగాడు పృథ్వీ షా సహా పలువురు ఆటగాళ్లు విఫలమైన సంగతి తెలిసిందే.   
చదవండి: ఐపీఎల్‌లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు