ఏడాది దాటిపోయింది.. ఇంతవరకు ప్రైజ్‌మనీ చెల్లించలేదు

23 May, 2021 21:44 IST|Sakshi

ముంబై: టీమిండియా మహిళల జట్టుపై బీసీసీఐ  వివక్ష చూపించిందంటూ వారం క్రితం సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌కు పర్యటనకు టీమిండియా పురుషులు జట్టు, మహిళల జట్టు ఏకకాలంలో బయల్దేరాల్సి ఉంది. అయితే ఇరు జట్లు ఒకే ఫ్లైట్‌లో వెళ్లరని.. మహిళల జట్టుకోసం మరో చార్టడ్‌ ఫ్లైట్‌ సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇక కరోనా టెస్టుల విషయంలోనూ వివక్ష చూపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఖండించిన బీసీసీఐ మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, హర్మన్‌ ప్రీత్‌ లాంటి సీనియర్‌ క్రికెటర్లతో మాట్లాడించింది. బీసీసీఐ మాపై ఎలాంటి వివక్ష చూపించలేదని.. మాకు చార్టడ్‌ ఫ్లైట్‌ ఏర్పాటు చేసిందంటూ చెప్పుకొచ్చారు.

తాజాగా జీతాల చెల్లింపు విషయంలో బీసీసీఐ మరోసారి వివక్ష చూపిస్తుందంటూ కొత్త అంశం తెరమీదకు వచ్చింది. పురుషుల జట్టులో ఆటగాళ్లకు చెల్లించే వేతనంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు చెల్లించలేదని సమాచారం. విషయంలోకి వెళితే.. 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ  5లక్షల డాలర్లు( భారత కరెన్సీలో రూ.36 కోట్లు) ప్రైజ్‌మనీ ఇచ్చింది. అయితే ఇంతవరకు బీసీసీఐ ఆ ప్రైజ్‌మనీని మహిళా క్రికెటర్లకు డిస్ట్రిబ్యూట్‌ చేయలేదని సమాచారం. టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొన్న 15 మంది జట్టులో ఒక్కో ప్లేయర్‌కి 33వేల డాలర్లు అందుతుంది( ఇండియన్‌ కరెన్సీలో రూ. 24లక్షలు). దీనివల్ల మహిళ క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అదే పురుష క్రికెటర్లు ఒక సిరీస్‌ ఆడిన వారానికే వారి ఖాతాల్లో డబ్బులు వచ్చి చేరతాయి.. కానీ మహిళల జట్టు విషయానికి వచ్చే సరికి పరిస్థితి మారిపోతుంది.

ఇదే విషయమై ఫిమేల్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ సభ్యులు స్పందించారు. ''బీసీసీఐకి పురుష క్రికెటర్లపై ఉన్న ప్రేమ మహిళల క్రికెటర్లపై ఎందుకు లేదు. ఏడాది క్రితం ఐసీసీ ఇచ్చిన ప్రైజ్‌మనీని ఇప్పటివరకు ఆటగాళ్లకు చెల్లించలేదు. దీనికి వివక్ష అనకుండా ఇంకేం అంటారో మీరే చెప్పిండి. సమయానికి ఆ డబ్బు అందించి ఉంటే కరోనా, లాక్‌డౌన్‌ సమయాల్లో వారికి ఎంతగానో ఉపయోగపడేవి. కాగా  ఈ వార్తలపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
చదవండి: షూస్‌ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్‌ ఆవేదన

కోహ్లి పెద్ద మనసు.. మాజీ క్రికెటర్‌ తల్లికి సాయం

టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష!

మరిన్ని వార్తలు