గంగూలీకి మరో రెండు బ్లాక్స్‌.. 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే

2 Jan, 2021 18:03 IST|Sakshi

దాదా గుండెలో ఇంకా రెండు బ్లాక్‌లు

సాక్షి, కోల్‌క‌తా:  బీసీసీఐ అధ్య‌క్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.  ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని, పూర్తిగా స్పృహలో  ఉన్నారని డాక్టర్ అఫ్తాబ్ విలేకరులకు  తెలిపారు. అయితే ఆయన మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. గంగూలీ, త‌న కూతురు స‌నాతోనూ మాట్లాడార‌ని, చికిత్స కొన‌సాగుతుంద‌నీ వుడ్‌ల్యాండ్స్ ఆసుప‌త్రి సీఈవో డాక్టర్ రూపాలి బసు వెల్లడించారు. 

గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వ‌హించి ఒక స్టెంట్ వేశామ‌ని అఫ్తాబ్‌  తెలిపారు. ఇంకా ఆయన గుండెలో మరో  రెండు బ్లాక్స్‌ ఉన్నాయని, వీటికి చికిత్స అందించనున్నామన్నారు. ఆది, సోమ‌వారాల్లో  మరో రెండు స్టంట్లు వేయనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరో 48 గంట‌ల పాటు దాదా హాస్పిట‌ల్‌లోనే ఉంటార‌ని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. అలాగే గంగూలీకి చికిత్స నిమిత్తం ముగ్గురు డాక్ట‌ర్ల‌తో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు కూడా తెలిపింది. కాగా గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్తతో  భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళనలో మునిగిపోయారు. ముఖ్యంగా  గంగూలీ నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్  భావోద్వేగ ట్వీట్‌ చేశారు. అటు పశ్చిమ బెంగాల్‌   సీఎం మమతా బెనర్జీ కూడా దాదా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు