అదే జరిగితే గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం!

14 Sep, 2022 07:11 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమావళిలో అమలవుతున్న లోధా కమిటీ సిఫార్సుల సవరణ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి. బోర్డు ప్రధానంగా 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, పదవుల మధ్య విరామం నిబంధనల్ని సవరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. బీసీసీఐ తరఫున మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు.

మంగళవారం నాటి విచారణ సందర్భంగా బోర్డు పరిపాలనలో విశేష అనుభవజ్ఞుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. 70 ఏళ్ల వయో నిబంధన తొలగించాలని జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ హిమ కోహ్లిలతో కూడిన బెంచ్‌ను కోరారు. దీనిపై స్పందించిన బెంచ్‌ ‘మరి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ల్లోనూ 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఉన్నారా? ఉంటే ఆ వివరాలు సమర్పించండి’ అని కోరింది. పదవుల మధ్య విరామం విషయంలో 12 ఏళ్లు ఏకధాటికి కొనసాగాలని బోర్డు కోరుకోవట్లేదని అయితే ఆరేళ్లు బీసీసీఐలో పనిచేశాక, తిరిగి రాష్ట్ర సంఘంలో పని చేసేందుకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు.

కానీ కోర్టు మాత్రం మూడేళ్ల చొప్పున రెండు దఫాలు వరుసగా కొనసాగిన ఆఫీస్‌ బేరర్‌కు విరామం ఉండాల్సిందేనని భావిస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! అందుకే బీసీసీఐ తరఫున కపిల్‌ సిబాల్‌ను రంగంలోకి దించింది. దీనిపై మంగళవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు