‘ఖేల్‌రత్న’ బరిలో మిథాలీ

1 Jul, 2021 06:17 IST|Sakshi

అశ్విన్‌ పేరును కూడా కేంద్ర క్రీడా శాఖకు బీసీసీఐ సిఫారసు

న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ కోసం భారత మహిళల టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ల పేర్లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది. ‘అర్జున’ అవార్డు కోసం సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్, లోకేశ్‌ రాహుల్, జస్‌ప్రీత్‌ బుమ్రాలను సిఫారసు చేసింది. గతేడాది కూడా ధావన్‌ను ప్రతిపాదించినప్పటికీ చివరకు అవార్డుల కమిటీ అతన్ని పక్కన బెట్టింది. హైదరాబాద్‌కు చెందిన 38 ఏళ్ల మిథాలీ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆమె మొత్తం 11 టెస్టుల్లో (669 పరుగులు), 215 వన్డేల్లో (7,170 పరుగులు), 89 టి20 మ్యాచ్‌ల్లో (2,364 పరుగులు) భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. మిథాలీతో పాటు అశ్విన్‌ ఇదివరకే ‘అర్జున’ పురుస్కారం పొందారు. 34 ఏళ్ల అశ్విన్‌ 79 టెస్టుల్లో 413 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు, 46 టి20 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు పడగొట్టాడు.   

ఫుట్‌బాల్‌ స్టార్‌ సునీల్‌ ఛెత్రి...
భారత ఫుట్‌బాల్‌ స్టార్, కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి కూడా ‘ఖేల్‌రత్న’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నాడు. ఈసారి కూడా ఈ జాబితా చాంతాడంత ఉంది. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను సిఫారసు చేస్తే... ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ను అత్యున్నత పురస్కారానికి నామినేట్‌ చేసింది. రెండుసార్లు యూరోపియన్‌ టూర్‌ టైటిల్స్‌ నెగ్గిన గోల్ఫర్‌ శుభాంకర్‌ శర్మ, నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్‌ శరత్‌ కమల్‌... ‘షూటింగ్‌’ డబుల్‌ ట్రాప్‌లో ప్రపంచ టైటిల్‌ గెలిచిన అంకుర్‌ మిట్టల్, అంజుమ్‌ మౌద్గిల్‌లను వారి క్రీడా సమాఖ్యలు ‘ఖేల్‌రత్న’కు సిఫారసు చేశాయి. అన్ని ప్రతిపాదనలు స్క్రూటినీ చేశాక కేంద్ర ప్రభుత్వం నియమించిన అవార్డుల కమిటీ పురస్కార విజేతలను ఎంపిక చేస్తుంది.  
 

తెలుగమ్మాయి జ్యోతి సురేఖ కూడా...
తెలుగమ్మాయి, మేటి ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ కూడా ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ జాబితాలో ఉంది. భారత ఆర్చరీ సంఘం సురేఖ ప్రతిభను గుర్తించి అత్యున్నత క్రీడాపురస్కారానికి సిఫారసు చేసింది. కాంపౌండ్‌ విభాగంలో పోటీపడే 24 ఏళ్ల సురేఖ ప్రపంచకప్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కలిపి మొత్తం 12 పతకాలు సాధించింది.

మరిన్ని వార్తలు