రాజీవ్‌ఖేల్‌రత్న రేసులో అశ్విన్‌, మిథాలీ రాజ్‌

30 Jun, 2021 14:39 IST|Sakshi

ఢిల్లీ: 2021 ఏడాదికి సంబంధించి క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ఖేల్‌ రత్న అవార్డుకు టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు టీమిండియా మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌లను సిఫార్సు చేస్తున్నట్లు బీసీసీఐ బుధవారం వెల్లడించింది. వీరితో పాటు కేఎల్‌ రాహుల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, శిఖర్‌ ధావన్‌ల పేర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేర​కు బీసీసీఐ కేంద్ర క్రీడాశాఖకు సిఫార్సు చేస్తు దరఖాస్తును పంపించింది.

కాగా అశ్విన్‌, మిథాలీ రాజ్‌లు రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డుకు అన్ని అర్హతలు ఉన్నాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రవిచంద్రన్‌ అశ్విన్‌ కొన్ని రోజులుగా టెస్టుల్లో మంచి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. 2019-21 డబ్ల్యూటీసీ టోర్నీలో భాగంగా అశ్విన్‌ 71 వికెట్లు తీసి తొలిస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో టీమిండియా తరపున 400 వికెట్లకు పైగా తీసిన మూడో స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. 

ఇక మిథాలీ రాజ్‌ 22 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మిథాలీ రెండేళ్ల తర్వాత టాప్‌-5లోకి అడుగుపెట్టింది. కాగా గతేడాది రాజీవ్‌ఖేల్‌ రత్న అవార్డును టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు