వాట్‌మోర్‌కు కష్టమే

11 Aug, 2020 02:50 IST|Sakshi

 బీసీసీఐ ఎస్‌ఓపీ విడుదల

ముంబై: కరోనాను దృష్టిలో ఉంచుకొని దేశవాళీ క్రికెట్‌ నిర్వహించే విషయంలో బీసీసీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 100 పేజీల స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను విడుదల చేసింది. దీని ప్రకారం 60 ఏళ్లు దాటిన వ్యక్తులు దేశవాళీ జట్లకు కోచ్‌లుగా కూడా వ్యవహరించరాదు. అందరికంటే ముందుగా బరోడా రంజీ కోచ్‌ డేవ్‌ వాట్‌మోర్‌పై దీని ప్రభావం పడనుంది. ఆస్ట్రేలియాకు చెందిన వాట్‌మోర్‌కు కోచ్‌గా అద్భుత రికార్డు ఉంది. 1996లో శ్రీలంకను ప్రపంచ కప్‌ విజేతగా నిలిపిన వాట్‌మోర్‌ ఆ తర్వాత పలు హోదాల్లో భారత్‌లో పని చేశారు. ప్రస్తుత సీజన్‌ కోసం గత ఏప్రిల్‌లో ఆయనను బరోడా కోచ్‌గా నియమించుకుంది.

అయితే తాజా నిబంధన ప్రకారం ఆయనను తప్పించాలని బరోడా క్రికెట్‌ సంఘం (బీసీఏ) దాదాపుగా నిర్ణయించింది. ఆరంభంలో బీసీఏ అధ్యక్షుడు ప్రణవ్‌ అమీన్‌ మద్దతుగా నిలిచి కొనసాగించాలని భావించినా.... సంఘంలోని ఇతర సభ్యులు దీనికి అభ్యంతరం తెలిపారు. ‘మన ఆటగాళ్ల ఆరోగ్యం మనకు అన్నింటికంటే ప్రధానం. 60 ఏళ్లు దాటిన వాట్‌మోర్‌కు కరోనా వల్ల ఇబ్బందులు రావచ్చు. అది వ్యాపిస్తే చాలా కష్టం. పైగా అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉన్న సమయంలో ఆస్ట్రేలియా నుంచి ఆయన ఎలా వస్తారు’ అని బీసీఏ సంయుక్త కార్యదర్శి పరాగ్‌ పటేల్‌ ప్రశ్నించారు. మరో వైపు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం తమ కోచ్‌ అరుణ్‌ లాల్‌ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉండగా... సౌరాష్ట్ర కూడా సీజన్‌ ప్రారంభమయ్యే సమయానికి తమ కోచ్‌ కర్సన్‌ ఘావ్రీ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

>
మరిన్ని వార్తలు