Ind Vs WI Series: ఫ్యాబ్‌-ఫోర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!

9 Feb, 2022 20:34 IST|Sakshi

టీమిండియా సీనియర్‌ టెస్టు క్రికెటర్లు రహానే, పుజారా, ఇషాంత్‌, వృద్ధిమాన్‌ సాహాలపై వేట పడనుంది. రాబోయే శ్రీలంకతో టెస్టు సిరీస్‌ నుంచి ఈ నలుగురిని తప్పించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫ్యాబ్‌-ఫోర్‌ క్రికెటర్లకు వ్యక్తిగతంగానే సమాచారం అందించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ నలుగురిని శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు కనీసం పరిగణలోకి కూడా తీసుకోవద్దని సెలక్షన్‌ కమిటీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. 

''రహానే, పుజారా, ఇషాంత్‌, సాహాలపై వేటు నిజమే. వీరి స్థానంలో కొత్త మొహాలకు చాన్స్‌ ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఫ్యాబ్‌-ఫోర్‌కు పర్సనల్‌గా సమాచారం అందించాం. అయితే కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, జట్టులోని మరికొంతమంది సీనియర్‌ ఆటగాళ్ల అభిప్రాయాలు అడిగాకే ఈ నిర్ణయానికి వచ్చామంటూ'' బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.

చదవండి:  భారత టెస్ట్‌ జట్టులో చోటు దక్కదని తెలిసి సాహా కీలక నిర్ణయం

పుజారా, రహానేలకు బ్రేక్‌ మాత్రమే..
పుజారా, రహానేలకు ఇది బ్రేక్‌ మాత్రమే అని చెప్పొచ్చు.  గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న ఈ ఇద్దరు జట్టుకు భారంగా మారారు. అయితే ఇప్పటికి వీరిద్దరు రాణిస్తారనే నమ్మకం బీసీసీఐకి ఉంది. ఎందుకంటే ఎంత కాదనుకున్న రహానే, పుజారాలు ప్రస్తుతం టీమిండయా టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లు. కాబట్టి రానున్న రంజీ సీజన్‌లో వీరిద్దరు రాణిస్తే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరికి రంజీ సీజన్‌ కీలకం.

ఇషాంత్‌, సాహాల కెరీర్‌ ముగిసినట్లే..
ఇషాంత్‌, సాహాలను మాత్రం తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు వయసు పైబడడంతో ఫిట్‌నెస్‌ను అందుకోలేకపోతున్నారు. ఇషాంత్‌ బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. 33 ఏళ్ల వయసు ఉన్న ఇషాంత్‌ మహా అయితే మరో రెండేళ్లు క్రికెట్‌ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షమీ, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌లకు తోడూ సిరాజ్‌, శార్దూల్‌ లాంటి కొత్త బౌలర్లు వస్తుండడంతో ఇషాంత్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమై. దీంతో ఇషాంత్‌ రిటైర్‌ అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడున్నారు. పరోక్షంగా బీసీసీఐ కూడా ఇషాంత్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లే.

చదవండి: IND Vs WI: కేఎల్‌ రాహుల్‌ హిట్టయ్యాడు కానీ సమస్య అక్కడే..

Virat Kohli: అదే నిర్లక్ష్యం.. ప్రతిష్టాత్మక వన్డేలో కోహ్లి చెత్త ప్రదర్శన

ఇక సాహా విషయంలోనూ బీసీసీఐ ఇదే అభిప్రాయంతో ఉంది. రెగ్యులర్‌గా కాకున్నా ఎప్పుడో ఒకసారి అవకాశాలు వస్తున్నప్పటికి సాహా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీనికి తోడూ వయసు కూడా 37 ఏళ్లు ఉండడం పెద్ద మైనస్‌గా మారింది. దాదాపు కెరీర్‌ చరమాంక దశలో సాహా ఉన్నాడు. ఇప్పుడు జట్టులో స్థానం ఆశించడం అత్యాశే అవుతుంది. ఒకపక్క రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌లు అన్ని ఫార్మట్లలోనూ రెగ్యులర్‌గా ఆటగాళ్లుగా మారిపోవడం.. వీరిద్దరు వికెట్‌కీపర్లు కావడంతో సాహాకు అవకాశాలు మరింతగా తగ్గిపోయాయి. కేఎస్‌ భరత్‌ లాంటి యంగ్‌ టాలెంటెడ్‌ ఆటగాళ్లు కూడా వస్తుండడంతో సాహా కెరీర్‌ దాదాపు ముగిసినట్లే. అందుకేనేమో ఎలాగూ టీమిండియాకు సెలక్ట్‌ కావడం లేదని ఈసారి రంజీ సీజన్‌కు దూరంగా ఉండాలని సాహా నిర్ణయం తీసుకున్నాడు. పైకి వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నప్పటికి..  అంతర్లీనంగా తనకు అవకాశాలు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఇక శ్రీలంకతో టీమిండియా రెండు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. 
ఫిబ్రవరి 25-మార్చి 1 మధ్య తొలి టెస్టు(మొహలీ)
మార్చి 5-9 రెండో టెస్టు(బెంగళూరు)

తొలి టి20- మార్చి 13, మొహలీ
రెండో టి20-మార్చి 15, ధర్మశాల
మూడో టి20- మార్చి 18, లక్నో

మరిన్ని వార్తలు