Asia Cup 2022 India Squad: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే..?

31 Jul, 2022 15:27 IST|Sakshi

ఆసియాకప్‌కు భారత జట్టును ఆగస్టు 8న బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఆసియా కప్‌లో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను ఆగస్టు 8లోపు ప్రకటించాలని ఆయా జట్లకు  ఆసియా క్రికెట్ కౌన్సిల్ డెడ్‌లైన్‌ విధించింది. ఈ క్రమంలో అదే రోజున ముంబైలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ సమావేశం కానుంది. కాగా జట్టు ఎంపిక ముందు స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్ ఫిట్‌నెస్‌, కోహ్లి ఫామ్‌ సెలక్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక గాయం నుంచి కోలుకున్న రాహుల్‌ను విండీస్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసింది.

అయితే ఈ సిరీస్‌కు ముందు రాహల్‌ కరోనా బారిన పడ్డాడు. దీంతో రాహుల్‌ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. కాగా కరోనా నుంచి కోలుకున్న రాహుల్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు. అతడికి  ఒకటెండ్రు రోజుల్లో ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఫిట్‌నెస్‌ పరీక్షలో రాహుల్‌ నెగ్గితేనే భారత జట్టుకు ఎంపిక కానున్నాడు. 

ఇక ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న కోహ్లి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన కోహ్లిని జింబాబ్వే టూర్‌కు ఎంపికచేస్తారని అంతా భావించారు. కానీ అతడికి విశ్రాంతిని పొడిగిస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. అయితే ఆసియా కప్‌కు తను అందుబాటులో ఉండనున్నట్లు కోహ్లి సెలెక్టర్లకు తెలిపినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. " గత కొన్ని సిరీస్‌ల నుంచి వర్చువల్ మీటింగ్స్‌ ద్వారా జట్టును సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం భౌతికంగా సమావేశమై ఆసియా కప్‌కు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఇక ఆసియా కప్‌కు ముందు రాహుల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని మేము ఆశిస్తున్నన్నాము. మరోవైపు కోహ్లి కూడా ఆసియా కప్‌కు అందుబాటులో ఉండనున్నట్లు సెలెక్టర్లకు తెలిపాడు" అని పేర్కొన్నాడు.  ఇక ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు ఆసియాకప్‌ యూఏఈ వేదికగా జరగనుంది.
చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌ ఆడడంపై కోహ్లి కీలక నిర్ణయం!

మరిన్ని వార్తలు