ఐపీఎల్‌లో మరో రెండు జట్లు!

4 Dec, 2020 01:32 IST|Sakshi

ఈ నెల 24న  బీసీసీఐ ఏజీఎమ్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మళ్లీ దశావతారం ఎత్తనుంది. పది జట్లతో లీగ్‌ను విస్తరించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 24న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్‌) ఏర్పాటు చేసింది. మొత్తం 23 అంశాలపై చర్చించేందుకు బోర్డు సమావేశమవుతున్నప్పటికీ ఏజీఎమ్‌ ప్రధాన ఎజెండా మాత్రం లీగ్‌లో తలపడే జట్లను పెంచడమేనని బోర్డు వర్గాలు తెలిపాయి. 

నిజానికి పది జట్లతో ఐపీఎల్‌ నిర్వహణ బోర్డుకు కొత్తేం కాదు. తొమ్మిదేళ్ల క్రితమే పది జట్లు (పుణే సహారా వారియర్స్, కొచ్చి టస్క ర్స్‌) ఐపీఎల్‌లో తలపడ్డాయి. అయితే ఈ పది జట్ల ముచ్చట 2013లోనే ముగిసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత విస్తరణ తెర మీదికొచ్చింది. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్‌. గుజరాత్‌కు చెందిన ఈ కార్పొరేట్‌ సంస్థ అహ్మదాబాద్‌ వేదికగా ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కనబరుస్తోంది. ఇదివరకే రెండేళ్లు రైజింగ్‌ పుణే సూపర్‌స్టార్స్‌ ఫ్రాంచైజీ ఉన్న సంజీవ్‌ గోయెంకాకు చెందిన ఆర్పీజీ సంస్థ కూడా తిరిగి వచ్చేందుకు తహతహలాడుతోంది. దీనికి లక్నో వేదిక కావచ్చు.

మరిన్ని వార్తలు