బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌.. హార్ధిక్‌తో పాటు ఆ ఇద్దరిపై కనక వర్షం..!

29 Jan, 2023 16:43 IST|Sakshi

బీసీసీఐ, సెలక్షన్‌ కమిటీ ఎన్నికల కారణంగా ఆలస్యమైన సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌ కొత్త జాబితా ప్రకటనకు మార్గం సుగమమైంది. వచ్చే నెలలో కొత్త జాబితా ప్రకటించేందుకు బీసీసీఐ ఇప్పటికే సన్నాహకాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈసారి ప్రకటించబోయే జాబితాలో అనూహ్య మార్పులు జరిగే అవకాశం ఉందని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు ఉప్పందించారు.

టీ20 జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా, వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, యువ స్టార్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌లకు భారీ ప్రమోషన్‌ దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురికి గ్రేడ్‌-ఏ జాబితాలో చోటు ఖాయమైందని సమాచారం. వీరితో పాటు ఇషాన్‌ కిషన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు కొత్తగా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కనుందని తెలుస్తోంది. ఈ ఇద్దరికి గ్రేడ్‌-సి జాబితాలో చోటు దక్కడం దాదాపుగా ఖరారైనట్లు వినికిడి.

గ్రేడ్‌-ఏ+ జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవని.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా ఈ జాబితాలో అలాగే కొనసాగుతారని తెలుస్తోంది. ఇక, సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌ కోల్పోయే ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శిఖర్‌ ధవన్‌, అజింక్య  రహానే, ఇషాంత్‌ శర్మ, వృద్దిమాన్‌ సాహా, మయాంక్‌ అగర్వాల్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురు వచ్చే సెంటల్ర్‌ కాంట్రాక్ట్స్‌లో చోటు కోల్పోవడం దాదాపుగా ఖరారైందని సమాచారం. 

ఇదిలా ఉంటే, డిసెంబర్‌లో జరిగిన బీసీసీఐ ఏపెక్స్‌ కమిటీ సమావేశంలో ఆటగాళ్ల వేతన సవరణ అంశంపై కూడా డిస్కషన్‌ జరిగినట్లు బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఏ+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లుకు 7 నుంచి 10 కోట్లు, ఏ కేటగిరీలో ఉన్నవారికి 5 నుంచి 7, బి కేటగిరీలో ఉన్న ప్లేయర్స్‌కు 3 నుంచి 5, సి కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు కోటి నుంచి 3 కోట్లకు వార్షిక వేతనం పెరుగనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.    

ప్రస్తుత బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రక్ట్స్‌..

ఏ+ గ్రేడ్‌ (7 కోట్లు): విరాట్‌ కోహ్లి, బుమ్రా, రోహిత్‌ శర్మ

ఏ గ్రేడ్‌ (5 కోట్లు): రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ షమీ

బి గ్రేడ్‌ (3 కోట్లు): చతేశ్వర్‌ పుజారా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మహ్మద్‌ సిరాజ్‌, హార్ధిక్‌ పాండ్యా

సి గ్రేడ్‌ (కోటి): శిఖర్‌ ధవన్‌, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, శుభ్‌మన్‌ గిల్‌, హనుమ విహారి, యుజ్వేంద్ర చహల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మయాంక్‌ అగర్వాల్‌ 

మరిన్ని వార్తలు