టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష!

18 May, 2021 16:37 IST|Sakshi

ముంబై: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి టీమిండియా పురుషుల, మహిళా క్రికెటర్లు కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం చేయనున్నట్లు సోమవారం వచ్చిన వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా కోహ్లి సేన, మిథాలీ సేన జూన్‌ 2న ముంబై నుంచి లండన్‌కు బయలుదేరుతాయనేది నిజమే అయినా.. ఇరు జట్లు ఒక ఫ్లైట్‌లో మాత్రం వెళ్లవట. టీమిండియా పురుషుల జట్టుకోసం ప్రత్యేక చార్టడ్‌ విమానం ఏర్పాటు చేసిన బీసీసీఐ మహిళా జట్టును మాత్రం కమర్షియల్‌ ప్లైట్‌లో పంపనున్నట్లు సమాచారం.

దీంతో బీసీసీఐ టీమిండియా మహిళా క్రికెట్‌పై వివక్ష చూపింస్తుదంటూ వార్తలు వస్తున్నాయి. కాగా బీసీసీఐ కూడా ఇంతవరకు పురుషులు, మహిళల జట్లు ఒకే విమానంలో వెళుతున్నట్లు అఫిషీయల్‌గా ఎక్కడా అనౌన్స్‌ చేయకపోవడంతో ఈ వార్తలు నిజమేనని పలువురు భావిస్తున్నారు. అంతేగాక జూన్‌ 2న లండన్‌కు వెళ్లనున్న టీమిండియా పురుషుల జట్టును ఈ బుధవారం క్వారంటైన్‌లోకి పంపించనున్నట్లు తెలిసింది. అయితే ఇదే సమయంలో మహిళా క్రికెటర్లకు మాత్రం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని తెలిసింది.

బీసీసీఐ ఇలా టీమిండియా మహిళల జట్టుపై వివక్ష చూపడం ఇది తొలిసారి కాదని.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ సమయంలోనే టీ20 వుమెన్స్‌ చాలెంజ్‌ నిర్వహించాలని భావించారు. అయితే మొదట నాలుగు టీమ్‌లతో నిర్వహించాలని భావించినా చివరకు ఏదో మొక్కుబడిగా మూడు జట్లను ఏర్పాటు చేసి లీగ్‌ను పూర్తి చేశారు. ఇక 2020 ఏడాదిలో కరోనా సమయంలో మొదట టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళుతుందని బీసీసీఐ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఈసీబీ బయెబబూల్‌లో నిర్వహించడానికి సిద్ధంగా లేదనే కారణం చెప్పి ఆ టోర్నీని రద్దు చేసింది. ఇంకా విచిత్రమేంటంటే.. తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్న పురుషుల జట్టులోని సభ్యులందరికి ఇంటివద్దే కరోనా పరీక్షలు జరిగేలా ఏర్పాటు చేస్తామని పేర్కొన్న బీసీసీఐ మహిళా క్రికెటర్ల విషయంలో మాత్రం మీ టెస్టులు మీరే చేసుకోవాలంటూ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. టీమిండియా పురుషుల జట్టుకు ఇస్తున్న గౌరవం మహిళల జట్టుకు బీసీసీఐ ఎందుకు ఇవ్వలేకపోతుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌ ఆడనుంది. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ జూన్‌ 18న సౌతాంప్టన్‌ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇం‍గ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. మరోవైపు భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జూన్‌ 16 నుంచి ప్రారంభంకానున్న మహిళల క్రికెట్‌ సమరంలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: భారత క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది..

మరిన్ని వార్తలు