పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రతిపాదనపై మండిపడ్డ బీసీసీఐ

1 Mar, 2021 20:03 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ ​కప్​ కోసం వీసాల మంజూరు విషయంపై పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన ప్రతిపాదనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వీసాల మంజూరు విషయంలో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ప్రతిపాదించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. క్రీడాకారుల వీసాలకు సంబంధించి ఎటువంటి అంక్షలూ ఉండవని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. పాక్‌ అభిమానులకు, జర్నలిస్టులకు సైతం వీసాలు మంజూరు చేయాలని పీసీబీ చైర్మన్‌ ఎహసాన్‌ మణి కోరటాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. 

వీసాల మంజూరు విషయంపై మార్చి నెలాఖరులోగా తమ నిర్ణయం చెప్పాలని షరతులు విధించడం పాక్‌ కండకావరంగా పేర్కొంది. తమ డిమాండ్లను తీర్చని పక్షంలో వేదికను యూఏఈకి మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తామని బెదిరించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పీసీబీ చేసిన ప్రతిపాదనలు అపరిపక్వతతో కూడినవిగా కొట్టిపారేసింది. టోర్నీ నుంచి నిష్క్రమించే ఉద్ధేశంతోనే పీసీబీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. 

భారత్‌, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో పీసీబీ ఇలాంటి ప్రతిపాదనలు తెరపైకి తేవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇరు జట్ల మధ్య చివరి సారిగా 2007లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్‌ జరిగింది. 2012లో పాక్‌ జట్టు మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడేందుకు భారత్‌లో పర్యటించింది. ఆ తరువాత దాయాదుల పోరు ఐసీసీ టోర్నీలకు ఆసియా కప్‌కు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పీసీబీ తాజా ప్రతిపాదనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత జటిలంగా మార్చేశాయి. కాగా, ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​ మాసాల్లో భారత్ వేదికగా టీ20 ప్రపంచ కప్​ జరగనున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు