Rishabh Pant: పంత్‌ పరిస్థితిపై బీసీసీఐ కీలక అప్‌డేట్‌

30 Dec, 2022 16:28 IST|Sakshi

టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో పంత్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం పంత్‌కు చికిత్స జరుగుతోందని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. అయితే పంత్‌ గాయాలు మాత్రం తీవ్రంగానే ఉందని పేర్కొంది. పంత్‌ నుదుటి చిట్లిందని అలాగే మొహంపై రెండు చీలికలు ఉన్నాయని తెలిపింది వీపుపై కాలిన గాయాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు కుడి మోకాలి లిగ్మెంట్‌ కదిలినట్లు ఎక్స్‌రేల్లో తేలినట్లు వెల్లడించింది. వీటితో పాటు కుడిచేయి మణికట్టు, కుడికాలు చీలమండ, పాదానికి కూడా గాయాలైనట్లు పేర్కొంది.

ఇక ఈ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే పంత్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడానన్నారు. వైద్యులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. పంత్‌ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామన్న జైషా.. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

చదవండి: Rishabh Pant: పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే..

మరిన్ని వార్తలు