Eng Vs Ind: షెడ్యూల్‌ ముందుకు జరపండి! 

21 May, 2021 07:57 IST|Sakshi
Photo Courtesy: BCCI/Instagram

టెస్టు సిరీస్‌పై ఈసీబీకి భారత్‌ విజ్ఞప్తి  

ముంబై: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌–2021ను ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తున్న బీసీసీఐ తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని... ఒక్కో టెస్టు షెడ్యూల్‌లో మార్పు చేసి కనీసం వారం ముందుగా సిరీస్‌ ముగించాలని ఇంగ్లండ్‌ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 4న మొదలయ్యే సిరీస్‌ సెప్టెంబర్‌ 14న ముగుస్తుంది. దీనిని కనీసం సెప్టెంబర్‌ 7 వరకు ముగించాలని బీసీసీఐ కోరుతోంది.

అలా చేస్తే కనీసం మూడు వారాల సమయం తమకు దొరుకుందని... అవసరమైతే రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున నిర్వహించైనా ఐపీఎల్‌లోని మిగిలిన 31 మ్యాచ్‌లను పూర్తి చేయవచ్చని భారత బోర్డు భావిస్తోంది. అయితే ఇది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువ! ఐదు టెస్టులకు సంబంధించి ఆయా తేదీల ప్రకారం దాదాపు అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. పైగా హోటల్‌ వసతి, బయో బబుల్, టీవీ ప్రసారపు ఏర్పాట్లు కొత్తగా చేయాల్సి రావడంతో పాటు ఈసీబీ తమ కౌంటీ జట్లను కూడా ఒప్పించాల్సి ఉంటుంది.   

చదవండి: గంగూలీది కష్టపడే తత్వం కాదు.. కానీ: చాపెల్‌
చారిత్రక మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి

మరిన్ని వార్తలు