ఆ వాటమే తనకు అవకాశాలు తెచ్చిపెట్టింది: నట్టూ

24 Jan, 2021 18:54 IST|Sakshi

చెన్నై: ఏదో ఒక ఫార్మాట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తే చాలనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, నెట్‌ బౌలర్‌గా ఎంపికై ఏకంగా మూడు క్రికెట్‌ ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేశాడు ఈ సేలం కుర్రాడు. అంతే కాదు తన బౌలింగ్‌ ప్రతిభతో మూడు ఫార్మట్లలోనూ రాణించి టీమిండియాకు భవిష్యత్తు ఆశా కిరణంలా మారాడు. అతడే తమిళనాడుకు చెందిన టి నటరాజన్‌. ఎడమ చేతి ఫాస్ట్‌ బౌలర్‌ అయిన నట్టూ.. తాను ఎడమ చేతి వాటం బౌలర్‌ను కావడమే కలిసొచ్చిందని అంటున్నాడు. 

ప్రస్తుతం సీనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బౌలర్లలో ఎక్కువ మంది  కుడి చేతి వాటం ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారని, ఎడమ చేతి వాటం బౌలర్‌ని కావడమే తనకు మూడు క్రికెట్‌ ఫార్మాట్లలో చోటు సంపాదించిపెట్టిందని నట్టూ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలో రాణించడానికి తాను ఎంతో కఠోరంగా శ్రమించానని, కేవలం శ్రమను మాత్రమే తాను నమ్ముతానని నట్టూ తెలిపాడు. నెట్స్‌లో తాను శ్రమించడాన్ని గుర్తించిన కోచ్‌, కెప్టెన్లు తన బౌలింగ్‌పై పూర్తి నమ్మకంతో తనకు మూడు ఫార్మట్లలో ఆడే అవకాశాన్ని కల్పించారన్నారు. అన్ని ఫార్మట్లలో తుది జట్టులోకి తన ఎంపిక మాత్రం కేవలం ఎడమ చేతి వాటం బౌలర్‌ను కావడం వల్లనే జరిగిందని నట్టూ చెప్పుకొచ్చాడు. 

కాగా, ఆసీస్‌ పర్యటనకు నట్టూ కేవలం నెట్‌ బౌలర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. జట్టు సభ్యులు ఒక్కొక్కరిగా గాయాల బారినపడటంతో అతనికి భారత జట్టులో స్థానం లభించింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న నట్టూ..మూడు ఫార్మట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గబ్బాలో జరిగిన తన తొలి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్‌, మాథ్యూ వేడ్‌ల వికెట్లతో సహా మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్శించాడు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సేలం క్రికెట్‌ అసోసియేషన్‌కు తానెంతో రుణపడి ఉన్నానని, భవిష్యత్తులో సేలం క్రికెట్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని నట్టూ హామీ ఇచ్చాడు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు