కళ్లు చెదిరే సిక్స్‌.. కొడితే అవతల పడింది

31 Jan, 2021 16:46 IST|Sakshi

కాన్‌బెర్రా: ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ కటింగ్‌ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కప్పు కొట్టడంలో బెన్‌ కటింగ్‌ పాత్ర మరువలేనిది. ఆర్‌సీబీతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో  మొదట బ్యాటింగ్‌లో 15 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 39 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచి సన్‌రైజర్స్‌కు కప్పు అందించాడు.

తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్‌, బ్రిస్బేన్‌ హీట్‌ మధ్య ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ జరుగుతుంది. గెలిస్తే ఫైనల్‌ అవకాశాలు మరింత మెరుగయ్యే మ్యాచ్‌లో బెన్‌ కంటింగ్‌ జూలు విదిల్చాడు. 18 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే బెన్‌ కటింగ్‌ కొట్టిన నాలుగు సిక్సర్లలో .. ఒక సిక్సర్‌ స్టేడియం అవతల పడింది. మోర్నీ మోర్కెల్‌ వేసిన 18 ఓవర్‌ మూడో బంతిని కటింగ్‌ ప్రంట్‌ ఫుట్‌ వచ్చి డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి స్టేడియం రూఫ్‌ను తాకుతూ బయటపడింది. మీటర్‌ రేంజ్‌లో కటింగ్‌ కొట్టిన సిక్స్‌ 101 మీటర్లుగా నమోదైంది. బెన్‌ కటింగ్‌ సిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా!

ఈ సీజన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో కటింగ్‌ కొట్టిన సిక్స్‌ అత్యంత ఎత్తులో వెళ్లిన సిక్స్‌గా రికార్డుకెక్కింది. కాగా మొదట బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కటింగ్‌ 34, సామ్‌ బిల్లింగ్స్‌ 34 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ ఆడుతున్న బ్రిస్బేన్‌ హీట్స్‌ ఇప్పటివరకు 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. హీట్స్‌ గెలవాలంటే 48 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే

మరిన్ని వార్తలు