ఆ క్యాప్‌ ధరించడం ఇష్టం లేదు : స్టోక్స్‌

1 Jan, 2021 11:41 IST|Sakshi

లండన్‌ : ఐసీసీ ఇటీవలే వన్డే, టెస్టు, టీ20కి సంబంధించి దశాబ్దపు అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దశాబ్దపు టెస్టు క్రికెట్ జట్టును ప్రకటించింది. ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మందిని ఎంపిక చేసి ఒక జట్టుగా ప్రకటించింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఉంచగా.. తుది జట్టులో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌ పేరు కూడా ఉంది.‌ స్టోక్స్‌ టెస్టులతో పాటు వన్డే దశాబ్దపు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కాగా, దశాబ్దపు టెస్టు జట్టులో స్థానం సంపాదించిన వారికి ఐసీసీ టెస్టు క్యాప్‌లు బహుకరించింది. అయితే ఐసీసీ అందించిన క్యాప్స్‌పై స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. (చదవండి : క్యారీ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వహ్వా అనాల్సిందే)

‘దశాబ్దపు అవార్డుల్లో టెస్టు జట్టు సభ్యులకు ఇచ్చిన క్యాప్ ఆస్ట్రేలియా జట్టు వేసుకొనే బ్యాగీ గ్రీన్ కలర్‌లో ఉంది. ఇది నాకు అసంతృప్తిని కలిగించింది. నాకు ఈ అవార్డు రావడం గర్వంగా ఉన్నా.. బ్యాగీ గ్రీన్ క్యాప్ ధరించడం నచ్చలేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. దీనిపై ఐసీసీ తనదైన శైలిలో స్పందించింది. ‘సారీ బెన్ స్టోక్స్’ అంటూ ఒక లాఫింగ్ ఎమోజీని జత చేసింది. 

ఇక బెన్‌ స్టోక్స్‌ ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు సాధించాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఇంగ్లండ్‌ జట్టు జగజ్జేతగా నిలవడంలో స్టోక్స్‌ కీలకపాత్ర పోషించాడు. కాగా ఇంగ్లండ్‌ తరపున స్టోక్స్‌ 67 టెస్టుల్లో 4428 పరుగులు.. 158 వికెట్లు, 95 వన్డేల్లో 2682 పరుగులు.. 70 వికెట్లు తీశాడు. 

మరిన్ని వార్తలు