Ben Stokes: వైరల్‌గా మారిన ఇంగ్లండ్‌ కొత్త కెప్టెన్‌ చర్య

13 May, 2022 14:10 IST|Sakshi

ఇంగ్లండ్‌ టెస్టు కొత్త కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కౌంటీ క్రికెట్‌లో సూపర్‌ ఫామ్‌ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వోర్సెస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో డుర్హమ్‌ తరపున 88 బంతుల్లోనే 161 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆ తర్వాత అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ గ్లామోర్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టోక్స్‌ 110 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టు ‍మ్యాచ్‌ల సిరీస్‌కు ఒక రకంగా స్టోక్స్‌కు మంచి ప్రాక్టీస్‌ లభించినట్లే.

ఇక విషయంలోకి వెళితే.. గ్లామోర్గాన్స్‌ బౌలర్‌ మార్నస్‌ లబుషేన్‌ వేసిన ఒక బంతి స్టోక్స్‌ నడుము కింది భాగంలో తగిలింది. దీంతో స్టోక్స్‌ క్రీజులోనే కిందపడిపోయాడు. అయితే ఇదంతా ఫన్నీగా మాత్రమే. వాస్తవానికి స్టోక్స్‌కు పెద్దగా దెబ్బలు తగల్లేదు. తన కాలును స్ట్రెచ్‌ చేసుకోవడానికే స్టోక్స్‌ క్రీజులో పడిపోయాడు. అయితే స్టోక్స్‌కు దెబ్బ తగిలిందేమోనని పరిగెత్తుకొచ్చిన లబుషేన్‌ అసలు విషయం తెలుసుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పైకి లేచిన స్టోక్స్‌ తన బ్యాటింగ్‌ కంటిన్యూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్టోక్స్‌ 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఇంగ్లండ్‌ కొత్త కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఎంపికయిన సంగతి తెలిసిందే. కొత్త కెప్టెన్‌, కొత్త కోచ్‌ కలయికలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సరికొత్తగా సిద్ధమవనుంది. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు లార్డ్స్‌ వేదికగా జూన్‌ 2న ప్రారంభం కానుంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన డుర్హమ్‌ 311 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్‌ 2, కీగన్‌ పీటర్సన్‌ 7, లీస్‌ 44 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన గ్లామోర్గాన్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.

చదవండి: Harpreet Bhatia Forgery Case: అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం.. రంజీ క్రికెటర్‌పై చీటింగ్‌ కేసు

మరిన్ని వార్తలు