అశ్విన్‌ దెబ్బకు వార్నర్‌తో సమానంగా స్టోక్స్‌

16 Feb, 2021 12:17 IST|Sakshi

చెన్నై: టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌పై మరోసారి పైచేయి సాధించాడు. చెపాక్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో స్టోక్స్‌ రెండుసార్లు అశ్విన్‌కే దొరికిపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగిన స్టోక్స్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్బుత డెలివరీకి వెనుదిరిగాల్సి వచ్చింది. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 37వ ఓవర్‌ చివరి బంతి ఫ్లాట్‌గా రావడంతో స్టోక్స్‌ ఫ్రంట్‌ఫుట్‌ షాట్‌ ఆడుదామని భావించాడు. అయితే బంతి టర్న్‌ అయి స్టోక్స్‌ బ్యాట్‌ను ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ దిశగా తగిలి స్లిప్‌లో ఉన్న కోహ్లి చేతిలో పడింది. అశ్విన్‌ దెబ్బకు స్టోక్స్‌ బిక్కమొహం వేయాల్సి వచ్చింది. అలా ఇంగ్లండ్‌ 90 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోవాల్సి వచ్చింది.

కాగా ఇప్పటివరకు స్టోక్స్‌ను 9 సార్లు ఔట్‌ చేసిన అశ్విన్‌ తాజా అవుట్‌తో మొత్తం 10 సార్లు అవుట్‌ చేసినట్లయింది. ఇంతకముందు డేవిడ్‌ వార్నర్‌ను10 సార్లు అవుట్‌ చేసిన అశ్విన్‌ తాజాగా లెఫ్ట్‌ హ్యాండర్‌ అయిన స్టోక్స్‌ను అన్నే సార్లు ఔట్‌ చేయడం విశేషం. దీంతో పాటు స్టోక్స్‌ తాను ఆడిన చివరి మూడు ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కే వికెట్‌ సమర్పించుకోవడం విశేషం. ఇక ఇంగ్లండ్‌ జట్టు భారీ ఓటమి దిశగా పయనిస్తోంది. లంచ్‌ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. కెప్టెన్‌ రూట్‌ 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ 3 వికెట్లతో చెలరేగగా.. అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు తీశాడు.    
చదవండి: ఎట్టకేలకు కుల్దీప్‌ నవ్వాడు..!
బంతి దొరకడమే ఆలస్యం.. సూపర్‌ స్టంపింగ్‌

మరిన్ని వార్తలు