Ben Stokes: ఒక్క ఓవర్‌ 34 పరుగులు.. 64 బంతుల్లో సెంచరీ; ఇంగ్లండ్‌ కొత్త కెప్టెన్‌ విధ్వంసం

6 May, 2022 21:02 IST|Sakshi

ఇంగ్లండ్‌ టెస్టు జట్టు నూతన కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కౌంటీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. ఒక ఓవర్‌లో 34 పరుగులు పిండుకోవడంతో పాటు 64 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌ డివిజన్‌-2లో డర్హమ్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్‌ వోర్సెస్టర్‌షైర్‌పై ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్లే అవకాశం తృటిలో కోల్పోయినప్పటికి ప్రత్యర్థి బౌలర్‌కు మాత్రం చుక్కలు చూపించాడు.

ఇన్నింగ్స్‌ 117వ ఓవర్‌కు ముందు స్టోక్స్‌ 59 బంతుల్లో 70 పరుగులతో ఆడుతున్నాడు. జోష్‌ బేకర్‌ వేసిన ఆ ఓవర్‌లో తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన స్టోక్స్‌.. చివరి బంతిని బౌండరీ తరలించి 34 పరుగులు రాబట్టడంతో పాటు 64 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ముగిసిపోలేదు. డర్హమ్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే సమయానికి స్టోక్స్‌ 88 బంతుల్లో 8 ఫోర్లు, 17 సిక్సర్లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. 161 పరుగుల్లో 134 పరుగులు కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారానే వచ్చాయంటే స్టోక్స్‌ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో అర్థమయి ఉండాలి.

ఇక రెండోరోజు లంచ్‌ విరామం తర్వాత డర్హమ్‌ 6 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. బెన్‌ స్టోక్స్‌(161 పరుగులు), బెండిగమ్‌(135 పరుగులు), సీన్‌ డిక్సన్‌(104 పరుగులు) ఆ తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన వోర్సెస్టర్‌షైర్‌ టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.ఇక గతేడాది కాలంగా టెస్టుల్లో ఇంగ్లండ్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస సిరీస్‌ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జో రూట్‌ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు బెన్‌ స్టోక్స్‌ను కొత్త టెస్టు కెప్టెన్‌గా నియమించింది.

చదవండి: Brendon Mccullum: ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌!

మరిన్ని వార్తలు