ఇంగ్లండ్‌ జట్టుకు భారీ షాక్‌.. చారిత్రక సిరీస్‌కు స్టార్‌ ఆల్‌రౌండ‌ర్ దూరం

7 Oct, 2021 16:55 IST|Sakshi

Ben Stokes To Miss Ashes Series 2021-22: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చేతి వేలికి మరో స‌ర్జరీ జ‌ర‌గ‌డంతో యాషెస్ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారత్‌లో జరిగిన ఐపీఎల్‌-2021 తొలి దశ సందర్భంగా స్టోక్స్‌ గాయపడ్డాడు. ఆ సమయంలో అతను గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. అయితే తాజాగా అదే చేతి వేలికి మ‌రో స‌ర్జరీ జ‌రగడంతో అతను యాషెస్‌ నుంచి తప్పుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతానికి స్టోక్స్ పూర్తి ఫిట్‌గా ఉన్నా.. ఇప్ప‌ట్లో క్రికెట్‌ ఆడే అవ‌కాశం మాత్రం లేద‌ని ఓ నివేదిక వెల్ల‌డించింది. ఈ విషయాన్ని స్టోక్స్‌ సైతం సూచనప్రాయంగా అంగీకరించాడు. బుధ‌వారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేయగా.. అందులో అతను చేతి వేలికి బ్యాండేజీతో కనిపించాడు. ఈ ఫోటోలో స్టోక్స్‌ భార్య క్లేర్ కూడా ఉంది. కాగా, స్టోక్స్‌.. ఐపీఎల్‌లో గాయం తర్వాత మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగా భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌, ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేస్‌, టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వేదికగా జరిగే యాషెస్‌ సిరీస్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌ జట్టు సిద్ధమైనట్లు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. కరోనా కఠిన క్వారంటైన్‌ నిబంధనలను సడలించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పుకోవడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్టార్‌ ఆటగాళ్లు జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌లు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఆసీస్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య డిసెంబర్‌ 8 నుంచి జనవరి 18 వరకు యాషెస్‌ సిరీస్‌ జరుగనుంది.
చదవండి: చరిత్ర తిరగరాసిన ఆర్సీబీ బౌలర్‌.. బుమ్రా రికార్డు బద్దలు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు