Ben Stokes ODI Retirement: వన్డేలకు రిటైర్మెంట్‌ ఇస్తే.. టీ20ల నుంచి కూడా తప్పించారు! ఆ మాట అన్నందుకే ఇలా!

20 Jul, 2022 12:47 IST|Sakshi
బెన్‌స్టోక్స్‌- కెవిన్‌ పీటర్సన్‌

వైరల్‌ అవుతున్న కెవిన్‌ పీటర్సన్‌ ట్వీట్‌

Ben Stokes ODI Retirement- Eng Vs SA ODI Series: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, వన్డే వరల్డ్‌కప్‌-2019లో తమ జట్టు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు బెన్‌స్టోక్స్‌. ఇటీవలే అతడు ఇంగ్లండ్‌ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టి స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను గెలవడంతో పాటు రీషెడ్యూల్డ్‌ టెస్టులో టీమిండియాను ఓడించి కెప్టెన్‌గా మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు.

అందుకే ఇలా!
అయితే, అనూహ్యంగా వన్డేలకు గుడ్‌బై చెబుతూ స్టోక్స్‌ తీసుకున్న నిర్ణయం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా.. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమవుతోందన్న కారణంగానే తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు 31 ఏళ్ల స్టోక్స్‌.

అంతేకాదు.. తాము కూడా మనుషులమేమని, పెట్రోల్‌ పోస్తే పరిగెత్తే కార్లు కాదని.. విశ్రాంతి లేకుండా ఆడటం ఎవరితరం కాదని ఇంగ్లండ్‌ బోర్డుకు చురకలంటించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ నాసిర్‌ హుస్సేన్‌ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ, క్రికెట్‌ బోర్డుల తీరును తప్పుబడుతున్నారు. 

విశ్రాంతి లేకుండా ఆడిస్తే ఆటగాళ్లకు పిచ్చెక్కిపోయి ఇలాగే రిటైర్మెంట్‌ ప్రకటిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది.

‘‘అప్పట్లో ఓసారి.. షెడ్యూల్‌ భయంకరంగా ఉంది.. నా వల్ల కాదని చెప్పాను. అందుకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాను. అయితే, ఈసీబీ నన్ను టీ20లు కూడా ఆడకుండా నిషేధం విధించింది’’ అంటూ పీటర్సన్‌ ఇంగ్లండ్‌ బోర్డు తీరును ఎండగట్టాడు.

కాగా ఇంగ్లండ్‌ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు పీటర్సన్‌. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 8181, 4440, 1176 పరుగులు సాధించాడు. అయితే, ఈసీబీతో అతడికి విభేదాలు తలెత్తగా బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన పీటర్సన్‌ ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక 2013లో తన ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్‌.. 2014లో చివరిసారిగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. స్టోక్స్‌ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మంగళవారం(జూలై 18 )జరిగిన మొదటి వన్డే అతడికి చివరిది. ఈ మ్యాచ్‌లో స్టోక్స్‌ 5 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగిసిన రోజు వ్యవధిలోనే ఇంగ్లండ్‌ ప్రొటిస్‌తో పోరుకు సిద్ధమైంది. వన్డేలతో పాటు టీ20, టెస్టు సిరీస్‌ ఆడనుంది.

చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్‌ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా..

మరిన్ని వార్తలు