Ben Stokes Over Throw Controversy: మళ్లీ అదే స్టోక్స్‌.. 2019 వరల్డ్‌కప్‌ వివాదం గుర్తుకుతెచ్చేలా 

5 Jun, 2022 10:50 IST|Sakshi

2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓవర్‌ త్రో వివాదం అందరికి గుర్తుండే ఉంటుంది. ఒక్క ఓవర్‌ త్రో న్యూజిలాండ్‌ కొంపముంచగా.. ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా అవతరించింది. అప్పటి ఓవర్‌ త్రో వివాదానికి కేంద్ర బిందువు ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌. తాజాగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సేమ్‌ అలాంటి సీన్‌నే రిపీట్‌ అయింది. ఇప్పుడు కూడా స్టోక్స్‌ ఉన్నాడు.. అదీ ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా. అప్పుడు వివాదానికి దారి తీస్తే.. ఇప్పుడు మాత్రం నవ్వులు పూయించింది.

విషయంలోకి వెళితే.. 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగింది. ఇంగ్లండ్‌ గెలవాలంటే  మూడు బంతుల్లో 9 పరుగులు కావాలి. చివరి ఓవర్‌ బౌల్డ్‌ వేశాడు. ఆ ఓవర్‌లో మూడో బంతిని స్టోక్స్‌ మిడాఫ్‌ దిశగా ఆడాడు. బంతిని అందుకున్న మార్టిన్‌ గప్టిల్‌ రనౌట్‌కు అవకాశం ఉండడంతో ఓవర్‌ త్రో వేశాడు. రెండో పరుగు కోసం వస్తున్న స్టోక్స్‌ బంతిని గమనించి క్రీజులోకి డైవ్‌ చేశాడు. ఈ క్రమంలో బ్యాట్‌కు తాకిన బంతి మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీ వెళ్లింది.

అయితే పైకి లేచిన స్టోక్స్‌.. మొకాళ్లపై కూర్చొని ''బ్యాట్‌కు బంతి తగిలడంతో బౌండరీ వెళ్లింది.. ఇందులో నా తప్పేం లేదని'' పేర్కొనడం వైరల్‌గా మారింది.  ఊహించని పరిణామం చోటుచేసుకోవడంతో కివీస్‌ ఆటగాళ్లు షాక్‌ తినగా.. అంపైర్‌ బౌండరీ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. ఆ తర్వాత మ్యాచ్‌ టై అవ్వడం.. సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు.  

కాగా ఇంగ్లండ్‌, కివీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులోనూ అదే తరహా సీన్‌ మరోసారి రిపీట్‌ అయింది. ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌లో బౌల్ట్‌ బౌలింగ్‌లో జో రూట్‌ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడి స్టోక్స్‌ను క్విక్‌ సింగిల్‌కు పిలిచాడు. స్టోక్స్‌ స్పందించినప్పటికి.. అప్పటికే ఫీల్డర్‌ బంతిని అందుకోవడం చూసి వెనక్కి పరిగెత్తాడు. అయితే ఈ క్రమంలో రనౌట్‌ చేద్దామని భావించిన ఫీల్డర్‌ ఓవర్‌ త్రో వేయడం.. అచ్చం అప్పటి తరహాలోనే స్టోక్స్‌ బ్యాట్‌ను తాకుతూ మిడ్‌ వికెట్‌ మీదుగా పరుగులు పెట్టింది. అప్పటికే క్రీజులోకి వచ్చేసిన స్టోక్స్‌ రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈసారి బౌండరీ రాలేదు. వెంటనే స్టోక్స్‌ బౌల్ట్‌ పక్కన నిలబడి బ్యాట్‌కు తాకి బంతి అలా వెళ్లిందని.. తన తప్పేం లేదని సిగ్నల్‌ ఇచ్చాడు. ఇది చూసిన రూట్‌.. నా తప్పు కూడా ఏం లేదు అన్నట్లుగా స్టోక్స్‌ను అనుకరించడంతో మైదానంలో నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలి టెస్టులో ఇంగ్లండ్‌ బోణీ కొట్టేలానే కనిపిస్తోంది. 77 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. జో రూట్‌ (131 బంతుల్లో 77 నాటౌట్‌; 7 ఫోర్లు), బెన్‌ ఫోక్స్‌ (9 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు కోసం ఇంగ్లండ్‌ మరో 61 పరుగులు చేయాల్సి ఉంది.రెండో ఇన్నింగ్స్‌లోనూ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను రూట్, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (110 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 236/4తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది.

చదవండి: ENG vs NZ 2022: విజయానికి 61 పరుగుల దూరంలో ఇంగ్లండ్‌

Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు