Ben Stokes Slams ECB: 'కార్లు కాదు పరిగెత్తడానికి.. రిటైర్‌మెంట్‌తోనైనా మేల్కొనండి'

19 Jul, 2022 21:56 IST|Sakshi

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వన్డేలకు అనూహ్య రిటైర్మెంట్ ప్రకటించడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఇంగ్లండ్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్‌ ఇలా అర్థంతరంగా వన్డేల నుంచి తప్పుకుంటాడని ఎవరు ఊహించలేదు. అయితే తన రిటైర్‌మెంట్‌కు పరోక్షంగా ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌(ఈసీబీ) కారణమంటూ వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఒకరోజు వ్యవధిలో పేర్కొన్నాడు.

''పరిగెత్తడానికి మేము కార్లు కాదు.. నా వన్డే రిటైర్మెంట్‌తోనైనా మేల్కొంటే మంచిది'' అంటూ ఈసీబీకి పరోక్షంగా చురకలంటించాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్స్‌ మాట్లాడుతూ..''ఈసీబీ ఆటగాళ్లకు కనీస గ్యాప్‌ లేకుండా బిజీ షెడ్యూల్‌ ఉండేలా చేసింది. దీనివల్ల ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత కరువవుతుంది. నా విషయంలో ఇదే జరిగింది. పరిగెత్తడానికి మేము కార్లు కాదు.. కార్లంటే పెట్రోల్‌ పోస్తే.. ఎంత స్పీడు పెంచితే అంత వేగంగా వెళ్తాయి.

కానీ ఇక్కడ మేం మనుషులం. తీరిక లేకుండా క్రికెట్‌ ఆడితే ఎవరైనా అలసిపోతారు. ఆ సమయంలో రెస్ట్‌ అవసరం. కానీ విశ్రాంతి లేకుండా పరిగెత్తాలంటే ఎవరి తరం కాదు. ఒక 36 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నేను వెనుదిరిగి చూసుకుంటే గొప్ప ఇన్నింగ్స్‌లు కనబడాలే తప్ప ఉరుకులు పరుగులు కాదు. నా వన్డే రిటైర్‌మెంట్‌తోనైనా ఈసీబీ మేల్కొంటే మంచిది'' అంటూ పేర్కొన్నాడు. 

అంతకముందు వన్డే రిటైర్‌మెంట్‌కు గల కారణాన్ని స్టోక్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. "మూడు ఫార్మాట్లలో ఆడటం నాకు చాలా కష్టంగా ఉంది.తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా మూడు ఫార్మాట్లలో ఆడటానికి నా శరీరం సహకరించడం లేదు. అదే విధంగా వన్డే ఫార్మాట్లో వంద శాతం న్యాయం చేయలేపోతున్నాను.

కాబట్టి నా స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. అందుకే 11 ఏళ్ల వన్డే కెరీర్‌కు ముగింపు పలకాలి అని అనుకుంటునున్నాను. ఇకపై నా దృష్టింతా టెస్టు క్రికెట్‌పై పెట్టాలని  భావిస్తున్నా'' అంటూ రాసుకొచ్చాడు.

ఇక టీమిండియాతో సిరీస్‌ ముగిసిన వెంటనే ఒక్క రోజు వ్యవధిలో సౌతాఫ్రికాతో సిరీస్‌ మొదలైంది. జూలై నుంచి నవంబర్‌ వరకు ఇంగ్లండ్‌ జట్టు తీరిక లేకుండా గడపనుంది
సౌతాఫ్రికాతో 3 వన్డేలు, మూడు టెస్టులు, మూడు టి20లు
ఆస్ట్రేలియాతో మూడు టి20లు, మూడు వన్డేలు
అక్టోబర్‌- నవంబర్‌లో ఐసీసీ టి20 వరల్డ్‌ కప్‌ 2022 

చదవండి: Nasser Hussain: 'ఇలాగే కొనసాగితే.. ఆటగాళ్లకు పిచ్చెక్కడం ఖాయం'

Daria Kasatkina: 'నేనొక లెస్బియన్‌'.. రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు