స్టోక్స్‌ వచ్చాడు.. క్వారంటైన్‌కు వెళ్లాడు

4 Oct, 2020 20:54 IST|Sakshi

దుబాయ్‌: రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాడు.  తన తండ్రికి అనారోగ్యం కారణంగా ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభానికి ముందు రాలేకపోయిన స్టోక్స్‌.. ఈరోజు యూఏఈలో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ అధికారి ఒకరు ఏఎన్‌ఐకు తెలిపారు. స్టోక్స్‌ వచ్చిన వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. స్టోక్స్‌ వచ్చిన తర్వాత కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకుని ఆరు రోజుల క్వారంటైన్‌కు వెళ్లినట్లు సదరు అధికారి తెలిపారు.  స్టోక్స్‌ రాకతో రాజస్తాన్‌ బలం పెరిగింది. వచ్చే ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ నాటికి స్టోక్స్‌ జట్టులో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ‘ స్టోక్స్‌ వచ్చిన వెంటనే క్వారంటైన్‌కు వెళ్లాడు. ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు.(చదవండి: ‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’)

ఈ నెల 9వతేదీతో అతని క్వారంటైన్‌ గడువు ముగుస్తుంది. ఆ రోజు మేము ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ ఆడనున్నాం. కానీ ఆ మ్యాచ్‌లో స్టోక్స్‌ ఆడే అవకాశం లేదు. ఈనెల 11వ తేదీన ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు స్టోక్స్‌ అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం. మరొకసారి కరోనా టెస్టుల్లో స్టోక్స్‌కు నెగిటివ్‌ వస్తే జట్టుతో కలుస్తాడు. 10వ తేదీకి స్టోక్స్‌ జట్టుతో కలిసే అవకాశం ఉంది’ అని రాజస్తాన్‌ అధికారి తెలిపారు.న్యూజిలాండ్‌లో ఉండే స్టోక్స్‌ తండ్రి క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో గత నెల పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. తండ్రి వద్దనే ఉంటూ ఐపీఎల్‌ ఆరంభపు  మ్యాచ్‌లకు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌ దేశస్తుడైన స్టోక్స్‌.. ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్‌ సాధించడంలో స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని వార్తలు