Ranji Trophy 2022-23: 306 పరుగుల తేడాతో భారీ విజయం.. ఫైనల్లో బెంగాల్‌

12 Feb, 2023 15:03 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో బెంగాల్‌ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో బెంగాల్‌ 306 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 547 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ 241 పరుగులకు ఆలౌటైంది. రజత్‌ పాటిదార్‌ 52 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు.

బెంగాల్‌ బౌలర్లలో ప్రదీప్తా ప్రమానిక్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. ముఖేష్‌ కుమార్‌ రెండు వికెట్లు, షాబాజ్‌ అహ్మద్‌, ఆకాశ్‌ దీప్‌ చెరొక వికెట్‌ తీశారు. కాగా రంజీల్లో బెంగాల్‌ ఫైనల్‌ చేరడం ఇది 15వ సారి. ఇంతకముందు 14సార్లు ఫైనల్‌ చేరినప్పటికి రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచిన బెంగాల్‌.. మిగతా 12సార్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. 

అంతకముందు బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్‌ అయింది. మజుందార్‌ 120 పరుగులు, సుదీప్‌ ఘరామి 112 పరుగులు సెంచరీలతో చెలరేగారు. అభిషేక్‌ పొరెల్‌ 51 పరుగులతో రాణించాడు. అనంతరం మధ్యప్రదేశ్‌ జట్టు 170 పరుగులకు కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినట్లయింది. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 279 పరుగులకు ఆలౌటై మధ్యప్రదేశ్‌ ముందు 547 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.  ఇక కర్ణాటక, సౌరాష్ట్రల మధ్య జరుగుతన్న మరో సెమీఫైనల్‌ విజేతతో బెంగాల్‌ జట్టు ఫైనల్లో తలపడనుంది.

మరిన్ని వార్తలు