Ind Vs Aus 1st Test: మూడు రోజుల్లోనే ఖతం.. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా

11 Feb, 2023 14:34 IST|Sakshi

India vs Australia, 1st Test: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టెస్టులో పర్యాటక ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో మట్టికరిపించింది. నాగ్‌పూర్‌లో మ్యాచ్‌లో భారీ విజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. భారత స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే మొదటి టెస్టు ముగిసిపోయింది. 

మ్యాచ్‌ సాగిందిలా..
విదర్భ క్రికెట్‌ స్టేడియంలో గురువారం(ఫిబ్రవరి 9)న మొదలైన టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో మొదటి వికెట్‌ తీసి భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ శుభారంభం అందించగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ విశ్వరూపం ప్రదర్శించారు. వీరికి తోడు షమీ కూడా రాణించాడు. టీమిండియా బౌలర్ల విజృంభణతో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట​ అయి తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.

రెండో రోజే సంపూర్ణ ఆధిపత్యం
ఓవర్‌నైట్‌ స్కోరు 77/1తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్‌ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నడిపించాడు. ‘నైట్‌ వాచ్‌మన్‌’ బ్యాటర్‌ అశ్విన్‌ (62 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. రెండో వికెట్‌ భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో కొత్త స్పిన్నర్‌ మర్ఫీ మాయాజాలం జట్టును ఇబ్బంది పెట్టింది.

అశ్విన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న మర్ఫీ... స్వల్ప వ్యవధిలో వెటరన్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారా (14 బంతుల్లో 7; 1 ఫోర్‌)ను కూడా బోల్తా కొట్టించాడు. దీంతో రోహిత్‌కు కోహ్లి జతయ్యాడు. జట్టు స్కోరు 151/3 వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు.  

రోహిత్‌ సెంచరీ 
రెండో సెషన్‌ మాత్రం కష్టాలతో మొదలైంది. స్పిన్‌కు కలిసొచ్చిన పిచ్‌పై మర్ఫీ తొలి బంతికే కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఆట ముగించాడు. లెగ్‌స్టంప్‌కు ఆవల వేసిన బంతిని కోహ్లి ఫ్లిక్‌ చేయాలనుకున్నాడు. కానీ అదికాస్తా బ్యాట్‌ అంచును తాకుతూ కీపర్‌ క్యారీ చేతికి చిక్కింది. 151 స్కోరు వద్ద నాలుగో వికెట్‌ పడగా... ఈ 4 వికెట్లు మర్ఫీనే పడగొట్టాడు. క్రీజులో పాతుకొనిపోయిన రోహిత్‌ 171 బంతుల్లో (14 ఫోర్లు, 2 సిక్స్‌లు) టెస్టుల్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

కానీ తొలి టెస్టు ఆడుతున్న మెరుపుల బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 8; 1 ఫోర్‌) నిరాశపరిచాడు. లయన్‌ బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. తర్వాత జడేజా అండతో భారత స్కోరును 200 పరుగులు దాటించాడు. రోహిత్, జడేజా జోడీ ముందు ఆసీస్‌ స్పిన్‌ పనిచేయలేదు. మర్ఫీ, లయన్‌ అలసిపోయారే తప్ప  జోడీని మాత్రం విడగొట్టలేకపోయారు. 226/5 స్కోరు వద్ద రెండో సెషన్‌ ముగిసింది. 

జడేజా, అక్షర్‌... ఫిఫ్టీ–ఫిఫ్టీ 
స్పిన్‌ వల్ల కాకపోవడంతో కంగారూ సారథి కమిన్స్‌ రంగంలోకి దిగాడు. మూడో సెషన్‌ ఆరంభంలో భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన రోహిత్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ (10 బంతుల్లో 8; 1 ఫోర్‌)కు నిరూపించుకునేకుందేకు చక్కని అవకాశం వచ్చినా... మర్ఫీ స్పిన్‌ ఉచ్చులో పడి తొందరగానే నిష్క్రమించాడు. 240 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కూలింది. 

ఈ దశలో జడేజాకు అక్షర్‌ పటేల్‌ జతయ్యాడు. క్రీజులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లే కావడంతో అవతలి వైపు స్పిన్‌ ఉచ్చు తేలిపోయింది. ఆఖరి సెషన్‌లో ఇద్దరు చక్కని సమన్వయంతో పరుగులు జతచేయడంతో ఆలౌట్‌ కావాల్సిన జట్టు 300 పైచిలుకు పరుగుల్ని అవలీలగా చేసింది.

చూడచక్కని బౌండరీలతో స్కోరును పెంచారు. ఈ క్రమంలో మొదట జడేజా 114 బంతుల్లో (7 ఫోర్లు), సెషన్‌ ముగిసేదశలో అక్షర్‌ 94 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు ఇద్దరు కలిసి 81 పరుగులు జోడించారు. 

మూడో రోజు ఖతం
మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే జడేజా(70)ను మర్ఫీ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో అక్షర్‌కు జతైన మహ్మద్‌ షమీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మర్ఫీ బౌలింగ్‌లో భారత పేసర్‌ షమీ వరుస సిక్సర్లు బాదాడు. 42 బంతుల్లో 36 పరుగులు చేసి.. అక్షర్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 

అయితే, మర్ఫీ బౌలింగ్‌లోనే అతడు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అక్షర్‌ పటేల్‌(84) కమిన్స్‌ బౌలింగ్‌లో అవుట్‌ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

అశ్విన్‌ విశ్వరూపం

ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియాకు భారత స్పిన్నర్లు ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. అశ్విన్‌ వరుస విరామాల్లో వికెట్లు తీసి తన పవరేంటో చూపించాడు. జడేజా రెండు, షమీ 2 వికెట్లతో మెరవగా.. అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

భారత బౌలర్ల విజృంభించడంతో 91 పరుగులకే కుప్పకూలింది ఆస్ట్రేలియా. దీంతో.. ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా(70 పరుగులు, 7 వికెట్లు) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టు స్కోర్లు
భారత్‌- 400
ఆస్ట్రేలియా- 177 & 91

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: IND vs AUS: ఏమైంది కోహ్లి? ఈజీ క్యాచ్‌ విడిచిపెట్టిన విరాట్‌! వీడియో వైరల్‌
IND vs AUS: అశ్విన్‌ అరుదైన రికార్డు.. రెండో భారత బౌలర్‌గా

మరిన్ని వార్తలు