ind Vs Aus: స్వదేశానికి పయనం.. అవమానించారు కాబట్టే అంటున్న గిల్‌క్రిస్ట్‌!!

20 Feb, 2023 15:42 IST|Sakshi

India vs Australia, 2nd Test: భారత పర్యటనలో అష్టన్‌ అగర్‌ పట్ల మేనేజ్‌మెంట్‌ వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. అందుకే అతడు స్వదేశానికి తిరిగి వచ్చే యోచనలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అగర్‌ను టీమిండియాతో మ్యాచ్‌లలో ఎందుకు ఆడించడం లేదో అర్థం కావడం లేదని.. అలాంటపుడు ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.

కాగా ఇప్పటి వరకు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ 9 వికెట్లు తీశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడో మ్యాచ్‌ సందర్భంగా టెస్టు ఆడాడు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అష్టన్‌ అగర్‌. 

రెండుసార్లు మొండిచేయి
ఈ క్రమంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్‌కు అనూలించే ఉపఖండ పిచ్‌లపై కీలక సిరీస్‌ నేపథ్యంలో నలుగురు స్పిన్నర్లకు స్థానం కల్పించింది క్రికెట్‌ ఆస్ట్రేలియా.

ఆష్టన్‌ అగర్‌(లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌), నాథన్‌ లియాన్‌(రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌), మిచెల్‌ స్వెప్సన్‌(రైట్‌ ఆర్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌)లతో పాటు 22 ఏళ్ల ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ తొలిసారిగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని తొలి టెస్టులో అరంగేట్రం చేసిన మర్ఫీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. రెండో మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు.


అష్టన్‌ అగర్‌

అరంగేట్రం చేసిన యువ ప్లేయర్లు ఇలా
ఇక మిచెల్‌ స్వెప్సన్‌ తన బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి పయనం కాగా.. మాథ్యూ కుహ్నెమన్‌ను భారత్‌కు పంపించింది యాజమాన్యం. ఈ క్రమంలో స్వెప్సన్‌ స్థానంలో వచ్చిన కుహ్నెమన్‌ ఢిల్లీ టెస్టుతో అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో తొలి టెస్టులో 2 వికెట్లతో రాణించాడు.

ఇలా వీరిద్దరు ప్రధాన స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌(మొత్తం 8 వికెట్లు )తో పాటు తమ వంతు పాత్ర పోషించారు. అయితే, అష్టన్‌ అగర్‌కు మాత్రం ఈ రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేయాలని భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి.

ఘోర అవమానం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌.. అష్టన్‌ అగర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘‘జట్టుకు ఎంపికకావడం, విదేశీ పర్యటనల్లో జట్టుతో పాటే ఉండటం.. అయినా ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాకపోవడం.. నిజంగా పెద్ద అవమానమే!

అందుకే అతడు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు’’ అని ఆస్ట్రేలియా రేడియో చానెల్‌లో గిల్‌క్రిస్ట్‌ చెప్పుకొచ్చాడు. అగర్‌ను మేనేజ్‌మెంట్‌ దారుణంగా అవమానిస్తోందని చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో ఓడి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఛాన్స్‌ను మరింత సంక్లిష్టం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఇండోర్‌ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఆరంభం కానుంది.

చదవండి: Ind Vs Aus: చెత్త బ్యాటింగ్‌.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్‌
BGT 2023: మూడో టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్‌.. సిరీస్‌ నుంచి వైదొలిగిన స్టార్‌ బౌలర్‌

మరిన్ని వార్తలు