ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. భారత తుది జట్టు.. సూర్య ఉంటాడా, అక్షర్‌కు అవకాశం ఉంటుందా..?

3 Feb, 2023 21:15 IST|Sakshi

BGT 2023: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. నెట్టింట దీనిపై పెద్ద చర్చే నడుస్తుంది. ఎవరికి తోచిన విధంగా వారు తమ తమ తుది జట్లను ప్రకటిస్తున్నారు. ఈ అంశంపై విశ్లేషకులు, మాజీలు సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 

ఇదిలా ఉంచి, భారత తుది జట్టులో ఎవరెవరు ఉండే అస్కారముందో ఓసారి పరిశీలిస్తే.. ప్రస్తుతమున్న భీకర ఫామ్‌ దృష్ట్యా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ స్థానం ఖాయంగా తెలుస్తోంది. అతనిపై ఎలాంటి నెగిటివ్‌ నిర్ణయం తీసుకునే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ​కు జతగా గిల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం పక్కా.

వన్‌డౌన్‌ విషయానికొస్తే.. ఈ స్థానం నయా వాల్‌ పుజారా కోసం ఎప్పటి నుంచో రిజర్వై ఉంది. ఇక నాలుగో ప్లేస్‌లో కోహ్లి రావడంపై కూడా ఎలాంటి అనుమానులు లేవు. సమస్య వచ్చేదంతా ఇక్కడి నుంచే. ఐదో స్థానంలో కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలా లేక సూర్యకుమార్‌వైపు మొగ్గు చూపాలా అన్న విషయంపై టీమిండియా యాజమాన్యం తర్జనభర్జన పడుతుండవచ్చు.

గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ పేరును టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పరిగణలోకి తీసుకోదు. వికెట్‌కీపర్‌గా శ్రీకర్‌ భరత్‌ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైనట్టే. ఒకవేళ మేనేజ్‌మెంట్‌ కేఎల్‌ రాహుల్‌ చేత కీపింగ్‌ చేయించాలని భావిస్తే సూర్యకుమార్‌కు అవకాశం వస్తుంది. ఆల్‌రౌండర్‌ కోటాలో రవీంద్ర జడేజాను ఆడించాలా లేక అక్షర్‌ పటేల్‌ వైపు చూడాలా అన్న అంశం కూడా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారుతుంది. స్పెషలిస్ట్‌ స్పిన్నర్ల కోటాలో అశ్విన్‌, కుల్దీప్‌ స్థానాలు పక్కా కాగా.. పేసర్ల కోటాలో మహ్మద్‌ షమీ, సిరాజ్‌ బరిలో​కి దిగడం దాదాపుగా ఖాయమేనని చెప్పవచ్చు. ఒ‍కవేళ ముగ్గురు పేసర్లను ఆడించాలని యాజమాన్యం భావిస్తే.. ఉనద్కత్‌, ఉమేశ్‌ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్/ సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్/ రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్‌ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

మరిన్ని వార్తలు