BGT 2023 Ind Vs Aus 2nd Test: బౌండరీ కొట్టి టీమిండియాను గెలిపించిన పుజారా

19 Feb, 2023 14:24 IST|Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెరీర్‌లో వందో టెస్ట్‌ ఆడిన పుజారా (31 నాటౌట్‌).. బౌండరీ కొట్టి మరీ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

ముఖ్యంగా భారత స్టార్‌ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/68, 7/42), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/57, 3/59) పట్టపగ్గాలు లేకుండా విజృంభించారు. వీరిలో మరీ ముఖ్యంగా జడేజా రెండో ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ వెన్ను విరిచాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. జడేజా ధాటికి ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది.

ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో హెడ్‌ (43), లబూషేన్‌ (35) మాత్రమే రెండంకెల స్కోర్‌ సాధించారు. ఈ ఇన్నింగ్స్‌లో జడేజా ఏకంగా ఐదుగురిని క్లీన్‌బౌల్డ్‌ చేయడం ఆసక్తికర విషయం. అనంతరం 115 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా రోహిత్‌ (31), కేఎల్‌ రాహుల్‌ (1), కోహ్లి (20), శ్రేయస్‌ అయ్యర్‌ (12) వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. పుజారాతో పాటు శ్రీకర్‌ భరత్‌ (23) క్రీజ్‌లో నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.

ఆసీస్‌ బౌలర్లలో లయోన్‌ 2, మర్ఫీ ఓ వికెట్‌ పడగొట్టాడు.  అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు చాపచుట్టేయగా.. భారత్‌ 262 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఖ్వాజా (81), హ్యాండ్స్‌కోంబ్‌ (72 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించగా.. అక్షర్‌ (74), కోహ్లి (44), అశ్విన్‌ (37)లు టీమిండియాను గట్టెక్కించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు షమీ 4, అశ్విన్‌, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఆసీస్‌ బౌలర్లలో లయోన్‌ 5, కున్నేమన్‌, మర్ఫీ చెరో 2 వికెట్లు, కమిన్స్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 


 

>
మరిన్ని వార్తలు