Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్‌ దూరం.. బీసీసీఐ ట్వీట్‌! గ్రేట్‌ అంటున్న ఫ్యాన్స్‌

24 Feb, 2023 20:16 IST|Sakshi
ట్రోఫీతో రోహిత్‌ శర్మ- ప్యాట్‌ కమిన్స్‌ (PC: BCCI)

India vs Australia Test Series: టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇండోర్‌ టెస్టుకు ముందు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వివిధ కారణాల వల్ల పలువురు ఆటగాళ్లు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. 

కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన ఈ పేస్‌ బౌలర్‌.. ఆమె ఆరోగ్యం కుదుటపడేంత వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. 

బీసీసీఐ ట్వీట్‌.. గ్రేట్‌ అంటున్న ఫ్యాన్స్‌
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కమిన్స్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘‘ప్యాట్‌ కమిన్స్‌, అతడి కుటుంబ సభ్యులకు కష్టకాలంలో మేము కూడా తోడుగా ఉంటాం. వారి కోసం ప్రార్థిస్తాం’’ అని బీసీసీఐ పేర్కొంది. ఈ సందర్భంగా.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కమిన్స్‌ కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది.

ఉమేశ్‌ యాదవ్‌కు సానుభూతి
అంతకంటే ముందు తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేసింది బీసీసీఐ. కాగా కమిన్స్‌ జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో టీమిండియాతో మూడో టెస్టుకు వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సారథిగా వ్యవహరించనున్నాడు.

ఆసీస్‌ గెలిస్తేనే నిలుస్తుంది
ఇక నాగ్‌పూర్‌, ఢిల్లీ టెస్టులను రెండున్నర టెస్టుల్లోనే ముగించిన టీమిండియా.. ఇండోర్‌ టెస్టు గెలిచి ట్రోఫీ గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియాతో పాటు అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న ఆస్ట్రేలియా ఓటమి నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. 

కాగా మార్చి 1 నుంచి ఇండోర్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. ఈ ఒక్క మార్పు మినహా ఢిల్లీలో ఆడిన జట్టునే కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.

చదవండి: David Warner: బాధగా ఉంది.. నేను కోరుకున్నది ఇది కాదు: వార్నర్‌ పోస్ట్‌ వైరల్‌
అద్భుతం ఆవిష్కృతమైన వేళ.. నాటి వీడియో చూశారా? సచిన్‌ వీర విహారం..

మరిన్ని వార్తలు