Ind Vs Aus: నెట్స్‌లో చెమటోడుస్తున్న పుజారా.. భిన్న షాట్లతో! వీడియో వైరల్‌

24 Feb, 2023 21:01 IST|Sakshi
ప్రాక్టీసులో పుజారా (PC: Instagram)

India vs Australia Test Series- 3rd Test: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా నయా వాల్‌ ఛతేశ్వర్‌ పుజారా ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు. తన నైపుణ్యాలకు మరింత మెరుగుపెట్టుకునేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత మ్యాచ్‌లలో పొరపాట్లు పునరావృతం కాకుండా బ్యాటింగ్‌ టెక్నిక్‌పై దృష్టి సారించాడు.

ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనేందుకు పుజారా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా నెట్స్‌లో భిన్న షాట్లు ప్రయత్నిస్తూ ఆటకు మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పుజారా తాజాగా షేర్‌ చేశాడు. ‘‘మూడో టెస్టుకు సిద్ధమవుతున్నా’’ అంటూ క్యాప్షన్‌ జతచేశాడు.

అనుకున్నంత లేదు
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియాకు బలమవుతాడని భావించిన టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్‌ పుజారా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి టెస్టులో ఏడు పరుగులకే పరిమితమైన అతడు.. కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ కావడం అభిమానులను నిరాశపరిచింది.

రెండుసార్లు స్పిన్నర్ల చేతికే
ఢిల్లీ మ్యాచ్‌తో వందో టెస్టు పూర్తి చేసుకున్న పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అజేయమైన 31 విలువైన పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఇప్పటి దాకా పూర్తిస్థాయిలో తన మార్కు చూపలేకపోయాడు ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.

ఇక తొలి టెస్టులో ఆసీస్‌ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీకి వికెట్‌ సమర్పించుకున్న పుజారా.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరో స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ చేతికి దొరికిపోయాడు. అందుకే మిగిలిన రెండు టెస్టుల్లో అత్యుత్తమంగా రాణించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

మూడో టెస్టుకు
మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే క్రమంలో రోహిత్‌ సేన ముందడుగు వేయగా.. కమిన్స్‌ బృందం మాత్రం వెనుకబడిపోయింది. నాలుగింట రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఇండోర్‌ టెస్టుకు కమిన్స్‌ దూరం కాగా స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్సీ చేపట్టనున్నాడు.

చదవండి: Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్‌ దూరం.. బీసీసీఐ ట్వీట్‌! గ్రేట్‌ అంటున్న ఫ్యాన్స్‌ 
Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌కు హర్మన్‌ కౌంటర్‌..

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara)

మరిన్ని వార్తలు