Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్‌.. కానీ పాపం..

18 Feb, 2023 10:53 IST|Sakshi

India vs Australia, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా ‘నయావాల్‌’ ఛతేశ్వర్‌ పుజారాకు చేదు అనుభవం ఎదురైంది. కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్‌లో అతడు డకౌట్‌ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే భారంగా పెవిలియన్‌ చేరాడు. వందో టెస్టులో సెంచరీ బాది సత్తా చాటాలని ఆశపడిన అభిమానులను ఉసూరుమనిపించాడు.

లియోన్‌ దెబ్బకు మూడు వికెట్లు
ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం (ఫిబ్రవరి 17) ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ఆరంభమైంది. భారత బౌలర్ల విజృంభణతో ఆస్ట్రేలియా తొలి రోజే 263 పరుగులకు ఆలౌట్‌ అయింది.

దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 9 ఓవర్లలో 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను నాథన్‌ లియోన్‌ అవుట్‌ చేశాడు.

దీంతో అతడి స్థానంలో పుజారా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 19.2 ఓవర్లో మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మను బౌల్డ్‌ చేసిన లియోన్‌.. అదే ఓవర్లో పుజారాను(19.4 ఓవర్‌) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు వెనుదిరగక తప్పలేదు. కాగా ఛతేశ్వర్‌ పుజారా కెరీర్‌లో ఇది వందో టెస్టు అన్న విషయం తెలిసిందే.

వాళ్ల తర్వాత
కాగా భారత్‌ తరఫున 100 టెస్టులు ఆడిన 13వ క్రికెటర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, అనిల్‌ కుంబ్లే, కపిల్‌దేవ్, సునీల్‌ గావస్కర్, వెంగ్‌ సర్కార్, గంగూలీ, కోహ్లి, ఇషాంత్‌ శర్మ, హర్భజన్‌,  సెహ్వాగ్‌ ఈ ఘనత సాధించారు. 

ఒకే ఒక్కడు
ఇక అంతర్జాతీయ టి20 ఫార్మాట్‌ మొదలయ్యాక ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడకుండానే 100 టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌ పుజారా.  

చదవండి: IND vs AUS: రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఓపెనర్‌ దూరం!
Ind Vs Aus 2023 2nd Test: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ.. బ్యాట్‌ను గట్టిగా బాదుతూ! వీడియో వైరల్‌

>
మరిన్ని వార్తలు