Ind Vs Aus: అప్పుడు కోహ్లి లేడు! ఇప్పుడలా కాదు.. టీమిండియాను చూసి ఆసీస్‌ వణికిపోతోంది! నిదర్శనమిదే..

4 Feb, 2023 11:49 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- రోహిత్‌ శర్మ- ప్యాట్‌ కమిన్స్‌

India Vs Australia BGT 2023- Test Series: న్యూజిలాండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్‌ను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే క్రమంలో కంగారు జట్టుతో ఫిబ్రవరి 9 నుంచి పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని మరోసారి కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

మరోవైపు.. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరినప్పటికీ ప్యాట్‌ కమిన్స్‌ బృందం.. రోహిత్‌ సేన అవకాశాలకు గండికొట్టాలనే తలంపుతో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్‌.. స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. డానియెల్‌ వెటోరిని కోచింగ్‌ బృందంలో చేర్చుకోవడం సహా మహేశ్‌ పితియా వంటి భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రాక్టీసు​ చేస్తోంది.

టీమిండియాను చూసి ఆసీస్‌ వణికిపోతోంది
ఇందులో భాగంగా ఆసీస్‌ ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ఆస్ట్రేలియా జట్టు సన్నాహకాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ సేనను చూసి ఆసీస్‌ భయపడుతోందన్న కైఫ్‌.. సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం సులువేమీ కాదని వారికి తెలుసునన్నాడు.


టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌

స్టార్‌ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాతో సిరీస్‌ అంటే వాళ్లు ఎంతగా భయపడుతున్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలు. గతంలో ఎప్పుడూ కూడా 18 మంది ప్లేయర్లతో ఆసీస్‌ ఇండియాకు వచ్చిందే లేదు. పటిష్ట టీమిండియా సొంతదేశంలో ఎంత ప్రమాదకారో వారికి తెలుసు. భారత్‌ను అంత తేలికగ్గా ఓడించలేమని వాళ్లకు తెలుసు. అందుకే వాళ్లు వణికిపోతున్నారు.

అప్పుడు కోహ్లి లేడు.. ఈసారి మాత్రం
గబ్బాలో ఆడినపుడు విరాట్‌ కోహ్లి లేడు. కానీ ఇప్పుడు తను జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆస్ట్రేలియా బలమైన జట్టే. సూపర్‌ ఫామ్‌లో ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇండియాలో ఆతిథ్య జట్టును ఓడించడం సులువేమీ కాదు. అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వాళ్లు ఎలా బ్యాటింగ్‌ చేస్తారో చూడాలి.

ఒకవేళ వాళ్లు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే హోరాహోరీ పోరును చూడవచ్చు’’ అని మహ్మద్‌ కైఫ్‌ వ్యాఖ్యానించాడు. కాగా 2017లో స్వదేశంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా.. 2020లో ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇక ఆ సమయంలో నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పితృత్వ సెలవుపై ఇండియాకు తిరిగి రాగా.. అజింక్య రహానే సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. 

చదవండి: WPL 2023: అంబానీ వర్సెస్‌ అదానీ.. తొలి మ్యాచ్‌లో ముంబైతో అహ్మదాబాద్‌ ‘ఢీ’
Deepak Chahar: దీపక్‌ చహర్‌ భార్యకు బెదిరింపులు

>
మరిన్ని వార్తలు