BGT 2023: అశ్విన్‌ సైంటిస్టా లేక బౌలరా..? జడేజా అదిరిపోయే సమాధానం

14 Mar, 2023 13:16 IST|Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌ డ్రా కావడంతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌కు కూడా చేరిం‍ది. BGT-2023లో ఆధ్యంతం అద్భుతంగా రాణించి, 4 టెస్ట్‌ల్లో 47 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్‌ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు షేర్‌ చేసుకున్నారు. 

అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే స్టార్‌ స్పిన్‌ ద్వయాన్ని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఆడగ్గా, వారు కూడా అదే రేంజ్‌లో అదిరిపోయే సమాధానలు చెప్పారు. ఈ సంభాషణల్లో భాగంగా హర్షా భోగ్లే అడిగిన ఓ ఆసక్తికర ప్రశ్నకు జడ్డూ ఇచ్చిన అదిరిపోయే సమాధానం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ హర్షా ఏం అడిగాడు, జడ్డూ ఏం చెప్పాడంటే.. 

హర్షా: అశ్విన్‌ సైంటిస్ట్‌కు ఎక్కువా.. లేక బౌలర్‌కు ఎక్కువ..?
జడేజా: అశ్విన్‌ అన్నింటి కంటే ఎక్కువ..

జడ్డూ సమాధానం​ విని హర్షా భోగ్లేకు ఫ్యూజులు ఎగిపోయాయి. ఇందుకు జడ్డూ వివరణ ఇస్తూ.. అశ్విన్‌కు చాలాచాలా మంచి క్రికెటింగ్‌ బ్రెయిన్‌ ఉంది.. అతను అనునిత్యం క్రికెట్‌ గురించే మాట్లాడుతుంటాడు.. అశ్విన్‌కు ప్రపంచంలోని అన్ని క్రికెట్‌ జట్లపై అవగాహణ ఉంది.. ఏ జట్టు ఏ మూలలో ఏ టోర్నమెంట్‌ జరుగుతుందో కూడా అతనికి తెలిసి ఉంటుంది.. ఇందుకే నేను యాష్‌ క్రికెట్‌ బ్రెయిన్‌కు సలాం​ కొడతాను, అందుకే అశ్విన్‌ భాయ్‌ అన్నింటి కంటే ఎక్కువ అని అంటానన్నాడు. 

ఇదిలా ఉంటే, టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకుని జోష్‌ మీద ఉన్న టీమిండియా ఈ నెల 17 నుంచి ప్రారంభంకాబోయే వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. తల్లి మరణించిన కారణంగా స్వదేశానికి వెళ్లిన ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండకపోవడంతో స్టీవ్‌ స్మితే వన్డే జట్టు పగ్గాలు కూడా చేపట్టనున్నాడు. మరోవైపు భారత జట్టుకు కూడా ఓ భారీ షాక్‌ తగిలింది. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సిరీస్‌ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. 

మరిన్ని వార్తలు