Mohammed Siraj: మ్యాచ్‌ ఓడినా మనసులు గెలిచిన సిరాజ్‌

3 Mar, 2023 16:58 IST|Sakshi

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా 9 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో నాలుగో ఇన్నిం‍గ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ 18.5 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ట్రెవిస్‌ హెడ్‌ 49 నాటౌట్‌, లబుషేన్‌ 28 నాటౌట్‌ కూల్‌గా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా ఈ మ్యాచ్‌ను కేవలం బ్యాటింగ్‌ వైఫల్యంతోనే ఓడిపోయిందని బలంగా చెప్పొచ్చు.

బ్యాటింగ్‌ విభాగంలో టాపార్డర్‌, మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ ఇలా ఏది చూసుకున్నా బలహీనంగా కనిపించింది. తొలి రెండు టెస్టుల్లో మనం గెలిచాం కాబట్టి బ్యాటింగ్‌పై విమర్శలు రాలేదు కానీ మూడో టెస్టు ఓడడంతో బ్యాటింగ్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక ఈ మ్యాచ్‌ గెలుపుతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. టీమిండియా మాత్రం ఓటమితో అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 9 నుంచి 13 వరకు ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది.

అయితే టీమిండియా మ్యాచ్‌ ఓడినా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మాత్రం తన చర్యతో అభిమనుల మనసులు గెలుచుకున్నాడు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన సిరాజ్‌ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఒక అభిమాని తనను పిలిచాడు. దీంతో అతని వద్దకు వెళ్లి కాసేపు మాట్లాడిన తర్వాత సిరాజ్‌ అతనికి తన ఎనర్జీ డ్రింక్‌ను తాగమంటూ గిఫ్ట్‌గా ఇచ్చాడు. సిరాజ్‌ చర్య ఆ అభిమానితో పాటు మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.

''సదరు అభిమాని దాహంగా ఉంది తాగడానికి ఎనర్జీ డ్రింక్‌ ఇవ్వమని అడిగి ఉంటాడు.. అభిమాని కోరికను తీర్చేందుకు సిరాజ్‌ వెంటనే తన చేతిలో ఉన్న ఎనర్జీ డ్రింక్‌ను విసిరేశాడంటూ'' కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: తప్పులే ఎక్కువగా.. ఎదురుదెబ్బ తగలాల్సిందే!

ప్రధాని మోదీని కలిసిన కెవిన్‌ పీటర్సన్‌

మరిన్ని వార్తలు