Ind Vs Aus 1st Test: గిల్‌, కుల్దీప్‌ వద్దన్న వెటరన్‌ క్రికెటర్‌.. ఇదేం బాలేదన్న ఫ్యాన్స్‌!

8 Feb, 2023 16:58 IST|Sakshi

India Vs Australia - 1st Test: టెస్టు క్రికెట్‌లో ప్రతిష్టాత్మక సిరీస్‌గా భావించే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కోసం టీమిండియా- ఆస్ట్రేలియా సన్నద్ధమవుతున్నాయి. నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9న ఈ సిరీస్‌ ఆరంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే క్రమంలో ఇరు జట్లకు ఈ సిరీస్‌ మరింత కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఈ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తుది జట్టులో ఎవరుంటారన్న అంశంపై తమ అంచనాలు తెలియజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌, మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తమ జట్టును ఎంచుకున్నారు. తాజాగా.. భారత వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ సైతం ఈ జాబితాలో చేరాడు. ఆసీస్‌తో మొదటి టెస్టుకు తన ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదేనంటూ ట్వీట్‌ చేశాడు.

గిల్‌ వద్దు..
ఓపెనర్‌గా భీకర ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ను కాదని.. రోహిత్‌కు జోడీగా కేఎల్‌ రాహుల్‌కు డీకే ఓటు వేయడం గమనార్హం. ఐదో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం ఇచ్చిన దినేశ్‌ కార్తిక్‌.. కుల్దీప్‌ యాదవ్‌కు మొండిచేయి చూపాడు. ఇక సూర్యతో పాటు ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ అరంగేట్రం చేయడం ఖాయమని చెప్పకనే చెప్పాడు.

ఇలా ఎందుకు డీకే అంటున్న ఫ్యాన్స్‌!
అయితే, డీకే జట్టుపై ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు. ఫామ్‌లో ఉన్న గిల్‌ను కాదని.. కేఎల్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడం బాగాలేదంటున్నారు. ఇక సూర్య ఇంతవరకు వన్డేల్లో కూడా పెద్దగా రాణించింది లేదని, కీలక సిరీస్‌లో అతడితో ప్రయోగాలు చేస్తే మూల్యం చెల్లించకతప్పదని అభిప్రాయపడుతున్నారు.

టీ20 ఫార్మాట్‌లో తనకు తిరుగులేదన్నది వాస్తవమని.. అయితే టెస్టుల్లో పరిస్థితి వేరే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ లేడు కాబట్టి.. రాహుల్‌ను ఐదో స్థానంలో ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. రంజీల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న కేఎస్‌ భరత్‌కు అవకాశం ఇవ్వడాన్ని అతడి అభిమానులు స్వాగతిస్తున్నారు. 

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు దినేశ్‌ కార్తిక్‌ ఎంచుకున్న భారత జట్టు
కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌.

చదవండి: Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్‌ పెట్టండి'
స్మిత్‌ను ఆరుసార్లు అవుట్‌ చేశా! అశ్విన్‌ పాదాలకు నమస్కరిస్తే.. వెంటనే! కోహ్లి కూడా..

మరిన్ని వార్తలు