Ind Vs Aus: చెత్త బ్యాటింగ్‌.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్‌

20 Feb, 2023 13:36 IST|Sakshi

India vs Australia- Test Series- BGT 2023: ‘‘పెర్త్‌ లేదంటే బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా ఉపఖండ జట్లతో ఎలా మ్యాచ్‌లు ముగిస్తుందో ఇప్పుడు వారి పరిస్థితి కూడా అలాగే తయారైంది. వరుస ఓటములు చూస్తుంటే వారి సన్నద్ధత ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఇండియాకు వచ్చే ముందు వాళ్లు అస్సలు ప్రిపేర్‌ అవ్వలేదని స్పష్టంగా తెలుస్తోంది. 

భారత గడ్డపై టీమిండియాను ఓడించడం అసాధ్యం. స్పిన్నర్లను ఆడటంలో ఆసీస్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. ఒకే సెషన్‌లో తొమ్మిది వికెట్లు పడ్డాయంటే వాళ్ల బ్యాటింగ్‌ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా అన్నాడు.

వాళ్లిద్దరు సూపర్‌
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా ప్రదర్శనపై పెదవి విరిచిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.. టీమిండియా ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లపై ప్రశంసలు కురిపించాడు. జడ్డూ బంతితో మాయ చేస్తే.. అక్షర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని కొనియాడాడు.

కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా.. ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ రెండు టెస్టుల్లో టీమిండియా గెలుపొందడంలో ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్‌ కీలక పాత్ర పోషించారు. 

గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన జడ్డూ రెండు మ్యాచ్‌లలోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచి సత్తా చాటాడు. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను రెండున్నర రోజుల్లోనే ముగించి 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలగా ఉంది.

చెత్త బ్యాటింగ్‌
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆస్ట్రేలియా ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్న వేళ అశ్విన్‌తో కలిసి అతడు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. 60- 70 పరుగులు సాధించాడు.

ఆస్ట్రేలియా మానసికంగా బలహీనపడిపోయింది. టెక్నికల్‌గానూ వారి ఆటలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆసీస్‌ బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎలా ఆడారో చూశాం కదా! షాట్ల ఎంపికలో పొరపాట్లు స్పష్టంగా కనిపించాయి. స్వీప్‌ షాట్లు కొంపముంచాయి. చెత్త బ్యాటింగ్‌తో భారీ మూల్యం చెల్లించారు’’ అని పాక్‌ మాజీ ఆటగాడు రమీజ్‌ అభిప్రాయపడ్డాడు.  

చదవండి: టీమిండియాలో గుజరాతీ క్రికెటర్ల హవా.. ఒకప్పటి కర్ణాటకలా..!
KL Rahul: వైస్‌ కెప్టెన్‌ హోదా తొలగింపు.. అతడి​కి లైన్‌ క్లియర్‌.. ఇక దేశవాళీ క్రికెట్‌ ఆడితేనే..

మరిన్ని వార్తలు