BGT 2023: ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. తుది జట్టులో ఇషాన్‌ కిషన్‌..!

8 Feb, 2023 16:00 IST|Sakshi

Ravi Shastri Prediction: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్‌ కోసం టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి తన ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను(భారత్‌) ప్రకటించాడు. ఐసీసీ రివ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి టెస్ట్‌లో భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ తన అంచనాను వెల్లడించాడు.

రవిశాస్త్రి పిక్‌ చేసిన 11 మందిలో రెండు అనూహ్య ప్రతిపాదనలు ఉన్నాయి. వికెట్‌కీపర్‌గా శ్రీకర్‌ భరత్‌ బదులు ఇషాన్‌కిషన్‌ను ఎంచుకున్న అతను.. అక్షర్‌ పటేల్‌ను కాదని కుల్దీప్‌ యాదవ్‌ వైపు మొగ్గు చూపాడు. ఓపెనింగ్‌ స్థానం కోసం శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంచనా వేశాడు. అఖరి నిమిషంలో కెప్టెన్‌, కోచ్‌ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.

గిల్‌ రాహుల్‌ మధ్య పోటీ ఉంటుందని చెప్పిన రవిశాస్త్రి ఐదో స్థానాన్ని సూర్యకుమార్‌ యాదవ్‌కు కన్ఫర్మ్‌ చేసి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పై పేర్కొన్న ప్రతిపాదనలు మినహాయించి అందరూ ఊహించినట్లుగానే జట్టును ఎంచుకున్నాడు. ఇదే సందర్భంగా రవిశాస్త్రి మరో ప్రిడిక్షన్‌ కూడా చేశాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 4-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని చెప్పాడు. కీలకమైన ఓపెనింగ్‌ మ్యాచ్‌లో గెలిస్తే.. టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తద్వారా సిరీస్‌ను క్లీన్‌ చేయడం సులువవుతుందని అభిప్రాయపడ్డాడు. 

ఇదిలా ఉంటే, రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. తమతమ శిక్షణా శిబిరాల్లో భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్‌, ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్‌ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్‌ 12, భారత్‌ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. 

రవిశాస్త్రి అంచనా వేసిన తుది జట్టు.. 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్/శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, సూర్యకుమర్ యాదవ్, ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్, కుల్దీప్‌ యాదవ్,  మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్  

సిరీస్‌ షెడ్యూల్‌..

  • ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్‌, నాగ్‌పూర్‌
  • ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్‌, ఢిల్లీ
  • మార్చి 1-5 వరకు మూడో టెస్ట్‌, ధర్మశాల
  • మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్‌, అహ్మదాబాద్‌

వన్డే సిరీస్‌..

  • మార్చి 17న తొలి వన్డే, ముంబై
  • మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం
  • మార్చి 22న మూడో వన్డే, చెన్నై 
     
మరిన్ని వార్తలు