BGT 2023: లావుగా ఉన్నందుకు సిగ్గు పడాలి.. రోహిత్‌ శర్మపై కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

23 Feb, 2023 15:37 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023 నేపథ్యంలో భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ.. రోహిత్‌ శర్మ ఓవర్‌ వెయిట్‌పై అసహసనం వ్యక్తం చేశాడు. లావుగా ఉన్నందుకు రోహిత్‌ శర్మ సిగ్గు పడాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీవీల్లో చూస్తే హిట్‌మ్యాన్‌ అస్సలు ఫిట్‌గా కనిపిం‍చడని, 140 కోట్లకు పైగా భారతీయులను రెప్రజెంట్‌ చేసే భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఫిట్‌గా లేకపోవడం అవమానకరమంటూ సరికొత్త వివాదానికి తెరలేపాడు.

అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఫిట్‌గా ఉండటం ఏ క్రీడకారుడికైనా చాలా ముఖ్యమని, ఈ విషయంలో జట్టు సారధి సభ్యులకు ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బరువు విషయంలో రోహిత్‌ ఇకనైనా జాగ్రత్త పడాలని, బరువు తగ్గించుకునేందుకు ఎక్స్‌ట్రా ఎఫర్ట్‌ పెడితే కానీ ఇది సాధ్యపడదని అన్నాడు. రోహిత్‌ గొప్ప ఆటగాడు, గొప్ప కెప్టెన్‌ అన్న విషయంతో ఏకీభవిస్తానని, టీవీల్లోనైనా సన్నగా కనిపించేందుకు కావాల్సిన కసరత్తులు చేయాలని సూచించాడు.

ఓ వ్యక్తి టీవీల్లో కనిపించేదానికి, నేరుగా చూసేదానికి చాలా వ్యత్యాసముంటుందని.. లావుగా ఉన్నవారు సైతం టీవీల్లో సన్నంగా కనపడతారని అన్నాడు. ఇంతటితో ఆగకుండా రోహిత్‌ను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ విరాట్‌ కోహ్లితో పోలుస్తూ ఇరువురు స్టార్‌ క్రికెటర్ల ఫ్యాన్స్‌ కొట్టుకునేందుకు కావాల్సి మసాలాను అందించాడు. కెప్టెన్‌ అనే వాడు జట్టు సభ్యులకు ఆదర్శంగా ఉండాలని, ఈ విషయంలో కోహ్లి యావత్‌ క్రీడా ప్రపంచానికే ఆదర్శమని పరుగుల యంత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లిని చూస్తే ఫిట్‌నెస్‌ అంటే ఇదీ అనేలా ఉంటాడని ఆకాశానికెత్తాడు.

రోహిత్‌పై కపిల్‌ దేవ్‌ ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశాడో కానీ, హిట్‌మ్యాన్‌ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను అస్సలు జీర్ణించుకోలేరు. రోహిత్‌-కోహ్లి అభిమానులు ఇప్పుడిప్పుడే కలిసిపోతుండగా.. కపిల్‌ ఈ తరహా కామెంట్స్‌ చేసి మళ్లీ ఇరు వర్గాల మధ్య అగ్గి రాజేశాడు. కాగా, రోహిత్‌ ఫిట్‌నెస్‌, అతని బరువుపై చాలాకాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

గతంలో చాలామంది దిగ్గజాలు కూడా హిట్‌మ్యాన్‌ బరువు తగ్గాలని సూచించారు. రోహిత్‌ ఓవర్‌ వెయిట్‌ కొన్ని సందర్భాల్లో ఆటపై కూడా ప్రభావం చూపింది. మధ్యమధ్యలో కొద్దికాలంపాటు వెయిట్‌ను కంట్రోల్‌లో పెట్టుకునే రోహిత్‌.. కొంచం గ్యాప్‌ దొరికిందంటే మళ్లీ మొదటికొస్తాడు. రోహిత్‌ బొద్దుగా ఉండటాన్ని ఉద్దేశిస్తూ అతనంటే సరిపడని వారు 'వడా పావ్‌' అని ఎగతాళి చేస్తుంటారు.

ఇలాంటి కామెంట్లు చేసే వారి కోసమైనా రోహిత్‌ సన్నబడాలని ఆశిద్దాం. కాగా, రోహిత్‌పై గతంలో ఈ తరహా కామెంట్స్‌ చేసిన వారిని ఫ్యాన్స్‌ ఆడుకున్నారు. బాడీ షేమింగ్‌ చేయడం కరెక్ట్‌ కాదని, ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే చెప్పాల్సిన పద్దతి ఇది కాదంటూ చురకలంటించారు. 

మరిన్ని వార్తలు