ChatGPT: రాహుల్‌ను తప్పించాలా? అదీ మరీ..! నీకున్న పాటి బుద్ధి వాళ్లకు లేదు!

22 Feb, 2023 13:59 IST|Sakshi

India vs Australia Test Series- KL Rahul: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నేపథ్యంలో టీమిండియా జట్టు కూర్పుపై క్రికెట్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఓపెనింగ్‌ జోడీపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను తప్పించాలని వెంకటేశ్‌ ప్రసాద్‌ లాంటి మాజీలు డిమాండ్‌ చేస్తుండగా... ఆకాశ్‌ చోప్రా, హర్భజన్‌ సింగ్‌ పరోక్షంగా కేఎల్‌కు అండగా నిలబడ్డారు.

అయితే, ఇప్పటికే మిగిలిన రెండు ఆఖరి టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ కేఎల్‌ రాహుల్‌ పేరుకు ఉన్న వైస్‌ కెప్టెన్‌ ట్యాగ్‌ తీసివేసింది. తద్వారా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని సంకేతాలు ఇచ్చింది.

కేఎల్‌ రాహుల్‌ను తప్పించాలా?
ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌)తో కూడిన చాట్‌బోట్‌ ‘చాట్‌జీపీటీ’ (జనరేటివ్‌ ప్రీ–ట్రైన్‌డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌) ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. భారత టెస్టు జట్టు నుంచి కేఎల్‌ రాహుల్‌ను తప్పించాలా? అన్న ప్రశ్నకు బదులుగా..

చాట్‌జీపీటీ ఆన్సర్‌ ఇదే!
‘‘ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ని నేను.. వ్యక్తులు, జట్ల పట్ల నాకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. అయితే, సాధారణంగా జరిగే విషయాల గురించి చెబుతా.. 

ఓ ఆటగాడిని జట్టు నుంచి తప్పించాలంటే గత కొంతకాలంగా అతడి ప్రదర్శన ఎలా ఉంది? పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడా లేడా? జట్టు ప్రయోజనాలు, అవసరాలకు అనుగుణంగా అతడి నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నాడా లేదా? అన్న అంశాలు పరిశీలిస్తారు.

ఒకవేళ కేఎల్‌ రాహుల్‌ ఇటీవలి టెస్టు మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించకపోతే.. వరుసగా విఫలమైతే.. జట్టులో అతడి స్థానంలో మెరుగ్గా ఆడగల ఆటగాళ్లు ఉంటే.. మేనేజ్‌మెంట్‌ అతడిని తప్పించే అంశం గురించి ఆలోచించవచ్చు.

అవన్నీ పరిగణనలోకి తీసుకుంటేనే
ఒకవేళ అతడు బాగా ఆడుతుంటే.. తమ వ్యూహాలకు అనుగుణంగా అతడు జట్టులో ఉండాలని భావిస్తే.. అతడిని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా.. పరిస్థితులకు తగ్గట్లుగా.. ఫిట్‌నెస్‌.. ఫామ్‌ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని మేనేజ్‌మెంట్‌ అంతిమ నిర్ణయం తీసుకుంటుంది’’ అని చాట్‌జీపీటీ సమాధానం ఇవ్వడం గమనార్హం.

నీకున్న పాటి బుద్ధి వాళ్లకు లేదు
ఈ ఆన్సర్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘సరిగ్గా చెప్పావు చాట్‌జీపీటీ.. నీకున్న పాటి బుద్ధి సెలక్టర్లకు లేదు. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా రాహుల్‌ను తప్పించడమే సరైంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులను రెండున్నర రోజుల్లోనే ముగించిన టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో రాహుల్‌ విఫలమయ్యాడు. ఇక మార్చి 1 నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్‌ వేదికగా ఆరంభం కానుంది. 

చదవండి: BGT 2023: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. లిస్టులో ఎవరున్నారో తెలియదు కానీ: గంభీర్‌
Bumrah: ‘అలసిపోయాను సర్‌.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్‌ చేయనా?’
Women T20 WC: కీపర్‌ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్‌ 

మరిన్ని వార్తలు