BGT 2023: ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. టీమిండియాతో చేరనున్న వాషింగ్టన్‌ సుందర్‌

3 Feb, 2023 19:18 IST|Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా మొదలుకానున్న మొదటి టెస్ట్‌ కోసం టీమిండియా సెలెక్టర్లు నలుగురు నెట్‌ బౌలర్లను ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ నలుగురు స్పిన్‌ బౌలర్లే కావడం విశేషం​. సెలెక్టర్లు ఎంపిక చేసిన నలుగురిలో టీమిండియా పరిమిత ఓవర్ల ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌, రాజస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌, టీమిండియా బౌలర్‌ రాహుల్‌ చాహర్‌, తమిళనాడు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌, ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ సాయి కిషోర్‌ ఉన్నారు.

ఈ నలుగురు స్పిన్నర్లు నాగ్‌పూర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియాతో రేపటి నుంచి కలుస్తారిన సెలెక్టర్లు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రకటించారు. ఆసీస్‌ బౌలర్లను, ముఖ్యంగా స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వైవిధ్యమైన స్పిన్నర్లు అవసరమనే ఉద్దేశంతో వీరిని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక జట్టులో నలుగురు స్పిన్నర్లు (కుల్దీప్‌, అశ్విన్‌, అక్షర్‌, జడేజా) ఉన్నప్పటికీ.. సెలెక్టర్లు అదనంగా మరో నలుగురు స్పిన్నర్లను (నెట్‌ బౌలర్లు) ఎంపిక చేశారు.

ఎందుకంటే ఆసీస్‌ స్పిన్‌ విభాగంలో (నాథన్‌ లయోన్‌ (ఆఫ్‌ స్పిన్నర్‌), మిచెల్‌ స్వెప్సన్‌ (లెగ్‌ స్పిన్నర్‌), టాడ్‌ మర్ఫీ (ఆఫ్‌ స్పిన్నర్‌), ట్రవిస్‌ హెడ్‌ (ఆఫ్‌ స్పిన్నర్‌), అస్టన్‌ అగర్‌ (లెఫ్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌)) ముగ్గురు ఆఫ్‌ స్పిన్నర్లు, ఓ లెగ్‌ స్పిన్నర్‌, ఓ లెఫ్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ ఉన్నారు. వీరిని ఎదుర్కోవాలంటే అదే వాటం ఉన్న బౌలర్లయితే ప్రయోజనకరంగా ఉంటుందని సెలెక్టర్లు ఈ ఎత్తుగడ వేశారు.

భారత స్పిన్‌ విభాగంలో ఒక్క అశ్విన్‌ మినహా మిగతా ముగ్గురు లెఫ్‌ ఆర్మ్‌ బౌలర్లే కావడంతో ఆఫ్‌ స్పిన్నర్‌, లెగ్‌ స్పిన్నర్లతో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయిస్తే బాగుంటుందని జట్టు కోచ్‌ సెలక్టర్లను కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆసీస్‌ బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్ల కంటే పేసర్ల (కమిన్స్‌, స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, బోలాండ్‌) డామినేషనే అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నెట్స్‌లో స్పిన్నర్లతో సమానంగా పేసర్లతో బౌలింగ్‌ చేయిస్తే, టీమిండియాకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు