Rahul Dravid: అటొక కన్ను.. ఇటొక కన్ను

13 Mar, 2023 21:56 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను(బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ) టీమిండియా నిలబెట్టుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌ డ్రా ముగియగా.. సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా వరుసగా నాలుగోసారి ట్రోఫీని అట్టిపెట్టుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. టీమిండియా తరపున కోహ్లి, గిల్‌లు సెంచరీలు చేస్తే.. ఆసీస్‌ నుంచి ఉస్మాన్‌ ఖవాజా, కామెరాన్‌ గ్రీన్‌లు శతకాలు చేశారు.

అయితే మ్యాచ్‌ డ్రాగా ముగిసినప్పటికి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదంతా న్యూజిలాండ్‌-శ్రీలంక మధ్య తొలి టెస్టులో వచ్చిన ఫలితం ద్వారానే. ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇదే విషయంపై స్పందించాడు.

''చాలా రోజుల తర్వాత రెండుజట్లు తీవ్రంగా పోటీ పడిన సిరీస్‌ ఇది. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆటగాళ్లు రాణించారు. తొలి టెస్టులోనూ సెంచరీ సాధించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టును నడిపించిన విధానం అద్బుతం. శుబ్‌మన్‌ గిల్‌ తొలి రెండు టెస్టుల్లో బెంచ్‌కే పరిమితం అయినప్పటికి.. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టాడు. గత నాలుగైదు నెలలుగా గిల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.

ఇలాంటి యువ ఆటగాడి ఆటను చూడడం చాలా బాగుంది. గిల్‌ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు శ్రమించడం నచ్చింది. ఇక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే కివీస్‌-లంక తొలి టెస్టుపై కూడా ఒక కన్ను వేసి ఉంచాం. ఇక్కడ లంచ్‌ బ్రేక్‌ అవగానే అక్కడ లంక-కివీస్‌ మ్యాచ్‌ ఫలితం తేలిపోయింది. ఇక టీమిండియాతో సిరీస్‌ ద్వారా ఆసీస్‌కు ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు దొరికారు. ఒకరు టాడ్‌ మర్ఫీ అయితే మరొకరు కున్హెమన్‌.

మాములుగా విదేశీ జట్లలో స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ ఒక్కడికంటే ఎక్కువగా ఉండడం అరుదు. అయితే ఈసారి ఆసీస్‌ ఆ విషయంలో జాక్‌పాట్‌ కొట్టింది. సీనియర్‌ నాథన్‌ లియోన్‌తో పాటు కున్హెమన్‌, మర్ఫీలు పోటీ పడి మరి వికెట్లు తీశారు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మాత్రం ఆస్ట్రేలియాతో సిరీస్‌ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటాం.'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: కోహ్లి క్రీడాస్పూర్తి.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు